US Attacks On Venezuela: 2026 ప్రారంభమైన మూడు రోజులకే పెను మార్పు చోటు చేసుకుంది. ఆకస్మిక సంఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 2026 లో ఎటువంటి యుద్ధాలు జరగకుండా ప్రపంచం మొత్తం శాంతితో, సామరస్యంతో ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది ..
ప్రపంచ పెద్దన్నగా పేరుపొందిన అమెరికా .. 2026 లో దాడులు మొదలుపెట్టింది. అది కూడా తన పక్కనే ఉన్న వెనిజులా దేశం పై శనివారం ఉదయం విమానాలతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల నేపథ్యంలో వెనిజులా దేశంలోని కారకాస్ ప్రాంతంలో భారీగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. విమానాల శబ్దాలతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
వెనిజులా దేశం నుంచి చాలా సంవత్సరాలుగా అమెరికాకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతూ ఉంటాయి. దీనివల్ల అమెరికాలో ఒక రకమైన అశాంతి వాతావరణం ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో వెనిజులాకు చెప్పి చూసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అమెరికా 2026లో వెనిజులా దేశంపై దాడులకు దిగింది. ముఖ్యంగా సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాలను అమెరికాకు తీసుకొస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులకు దిగాయి. శనివారం జరిగిన ఈ దాడులలో భారీగా శబ్దాలు వినిపించాయి. కారకాస్ నగరంలో భీకరమైన శబ్దాలు వినిపించడంతో ప్రజలు బయటికి వచ్చారు. భయభ్రాంతులకు గురై వీధుల వెంట పరుగులు తీశారు.
వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్లక్ష్యం వల్లే తమ దేశంలోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాదు, అతనితో పలు సందర్భాలలో చర్చలు జరిపింది. మాదక ద్రవ్యాలు రాకుండా చూడాలని అతడికి సూచించింది. అయినప్పటికీ ఉపయోగాలు లేకుండా పోవడంతో అమెరికా శనివారం తెల్లవారుజామున వెనిజుల మీద దాడులు మొదలుపెట్టింది. అయితే ఈ దాడులను వెనుజుల అధ్యక్షుడు ముందుగానే ఊహించారు. అంతేకాదు అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. ” గత ఏడాది ఆగస్టు నెలలో కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా సైనికులను మోహరించింది. నెలల తరబడి మా మీద తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని మార్చాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. మా వద్ద ఉన్న విస్తారమైన చమురు నిల్వలు పొందాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు కొనసాగించేది లేదని” మదురో గురువారం విలేకరులతో చెప్పారు. ఆయన చెప్పిన రెండు రోజుల్లోనే ఈ దాడులు జరగడం విశేషం. అయితే ఈ దాడులపై వెనిజులా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.