Iran War Impact: పశ్చిమాసియాలో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టాలని, అక్కడి పాలకులపై ప్రజలు చేపట్టిన ఉద్యమాన్ని వినియోగించుకుని రెజీమ్ చేంజ్ చేయాలని, ఇరాన్‌లోని చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప ఇరాన్‌పై యద్దుం ప్రకటించాడు. వెనజువెలా తరహాలో నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని అంచనా వేశాడు. కానీ 50 రోజులు దాటినా యుద్ధం ముగియలేదు. శాంతి ఒప్పందం జరగలేదు. పైగా ఇరాన్ యుద్ధానికి సిద్ధమంటోంది. అమెరికా షరతులకు మాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధం నుంచి బయటపడేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయింది. సుదీర్ఘ పోరాటం అమెరికాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వ్యయం, అదుపులేని రుణభారం అగ్రరాజ్యం ఆర్థిక పునాదులను కదిలిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జాతీయ రుణభారం జీడీపీలో 175 శాతానికి చేరుకోవడంతో, ఆర్థిక స్థిరత్వంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
యుద్ధ వ్యయం.. ఆర్థిక భారం..
అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఖజానాకు ప్రతిరోజూ దాదాపు 891 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) నష్టం వాటిల్లుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే దాదాపు 6 బిలియన్ డాలర్ల వ్యయం కావడం, రక్షణ బడ్జెట్ కంటే వడ్డీ చెల్లింపులకే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి రావడం వైట్ హౌస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ భారం ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు..
ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక స్థావరాలకే పరిమితం చేయకుండా, గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా, కువైట్ మరియు బహ్రెయిన్‌లోని వ్యూహాత్మక చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల వల్ల ఆయా దేశాల్లో మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోవడం, చమురు సరఫరాకు ఆటంకం కలగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. పునర్నిర్మాణానికి పట్టే సమయం, వ్యయం గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్థిరతను సృష్టించాయి.
తమ పరువును కాపాడుకుంటూ, తక్షణమే ఈ యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ తన పంతాన్ని వీడకుండా మొండిగా యుద్ధాన్ని కొనసాగిస్తుండటం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం చూపిస్తున్న ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా సూచిస్తోంది.
