Nara Lokesh: నారా లోకేష్( Nara Lokesh ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన ప్రచారం చేస్తోంది. ఆయనపై అవినీతి ముద్రను భవిష్యత్తులో వేసేందుకు ఇప్పటినుంచి పునాదులు కడుతోంది. గత వారం రోజులుగా నారా లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారు ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. తరచు ఆయన విదేశాలకు వెళ్తున్నారని.. కనీసం సమాచారం ఇవ్వకుండా వెళ్తున్నారని.. దీనిపైన సొంత పార్టీతో పాటు కూటమిలో చర్చ నడుస్తోంది అని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి లోకేష్ ఈనెల 18 నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా పునర్వికకు ఇంజక్షన్ వేసే సమయంలో మాత్రం కనిపించారు. తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో కానీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ కనిపించడం లేదు లోకేష్. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దీనిపై అనుమానం ఉంటుంది. అందుకే ప్రజల్లో అనుమానం పెంచేలా అనేక కథనాలను ప్రచురిస్తోంది.
* ప్రకటన లేకుండా..
సాధారణంగా క్యాబినెట్ మంత్రులు( cabinet ministers ) విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక కార్యాలయం నుంచి అధికారికంగా మంత్రి పర్యటన షెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ ఇప్పుడు వారం రోజులుగా లోకేష్ కనిపించలేదు. విదేశీ పర్యటనకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రకటన రాకపోవడంతో ఇది వ్యక్తిగత, కుటుంబ పర్యటన గా భావించవచ్చు. అయితే లోకేష్ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడిపోతుంది. ఈసారి కూడా ఆ పార్టీలో అదే కంగారు కనిపిస్తోంది. కానీ లోకేష్ బయటకు చెప్పకుండా విదేశాలకు వెళ్లడంపై సొంత వారి అనుమానిస్తున్నారు అని అర్థం వచ్చేలా కథనాలు రాయడం విశేషం. ఇది పక్కా వ్యూహంతో చేస్తున్న పని అన్న అనుమానాలు ఉన్నాయి.
* మూడు నెలల కిందట..
లోకేష్ జనవరిలో సైతం ఓ నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు( foreign tour) వెళ్లారు. ఆ సమయంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ప్రచారం చేసింది. చివరకు ఆ పార్టీకి లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడడం కూడా ఇష్టం లేదు. దానిపై కూడా నెగిటివ్ ప్రచారం చేసింది. ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ రూపంలో దానిపై స్పష్టతనిచ్చింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంత మాత్రం మార్పు రావడం లేదు. అయితే తరచూ లోకేష్ తో పాటు చంద్రబాబు విదేశీ పర్యటనలపై అనుమానం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోంది. అనుకూల మీడియాలో కథనాలు కూడా రాయిస్తోంది. ఇటువంటి సమయంలో లోకేష్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తన పర్యటనల విషయంలో ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీచేస్తే బాగుంటుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కానీ అధికారపక్షంగా అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.
