
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సేవలు భారత్ లో కాసేపు నిలిచిపోయాయి. పోస్టింగ్ సహా.. సెర్చింగ్, షేరింగ్ వంటి ఫీచర్స్ కొంతసేపు పనిచేయలేదు. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో.. చాలా మంది తమ అకౌంట్లకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అని సందేహించారు. ఆ తర్వాత ఈ విషయమై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది ఈ విషయమై కంప్లైంట్ చేశారు. దీనిపై ట్విటర్ వెంటనే స్పందించింది. ‘ట్వీట్స్ ఇప్పుడు తప్పక కనిపిస్తాయి. అయితే.. ట్విటర్ వెబ్ లోని ఇతర ఫీచర్స్ లోడ్ కాకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపింది. ఈ మెసేజ్ కనిపించిన కాసేపటికే ట్విటర్ సేవలు పూర్తిస్థాయిలో యాక్టివ్ అయ్యాయి.
అయితే.. ఇలా ఎందుకు అయ్యిందనే విషయమై మాత్రం ట్విటర్ వివరణ ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఓ సారి ఇదే తరహా సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా రూల్స్ విషయంలో ట్విటర్ వివాదం కొనసాగుతూనే ఉంది.
సోషల్ మీడియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబందనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. 50 లక్షల యూజర్లు దాటిన ప్రతీ సోషల్ మీడియా సంస్థ భారత్ లో ఆఫీసు తెరవడంతోపాటు భారత్ కు చెందిన వ్యక్తినే అధికారిగా నియమించాలి. అదేవిధంగా.. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటి విషయాల్లోనూ పక్కాగా వ్యవహరించాల్సి ఉంది. అయితే.. ట్విటర్ మొదట్నుంచీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ వివాదం ఇంకా పూర్తిస్థాయిలో ముగియలేదు.