Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి(America Prasident)గా రెండోసారి ఎన్నికయ్యారు. మూడు నెలల పాలనలోనే అటు అమెరికన్లకు, ఇటు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దూకుడైన పాలన, సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మొదలు పెట్టిన సుంకాల యుద్ధం(Tariff War). ఇప్పుడు ఆ దేశానికే ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పై ప్రభావం ఎంత?
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్షుడిగా చిన్నా–పెద్దా, మిత్ర–ప్రత్యర్థి దేశాల తేడా లేకుండా సుమారు 180 దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఈ నిర్ణయం వెనుక అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్(Huward Lutnic)కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ సుంకాల వ్యూహం విఫలమైతే లుట్నిక్‌ను బాధ్యుడిగా చిత్రీకరించేందుకు ట్రంప్ బృందం సిద్ధంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ చర్యలను నిశితంగా పరిశీలిస్తూ దీటుగా స్పందిస్తున్నాయి.
ట్రంప్ కేబినెట్‌లో వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న హోవార్డ్ లుట్నిక్, కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ సంస్థ మాజీ సీఈవో(CEO)గా ఆర్థిక విధానాల రూపకల్పనలో పాల్గొన్నారు. సుంకాల ద్వారా అమెరికాకు ఆదాయం వస్తుందని ఆయన వాదిస్తున్నారు.
మాంద్యం ముప్పు..
అయితే, నిపుణులు ఈ చర్యల వల్ల ఆర్థిక మాంద్యం ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. లుట్నిక్ మాత్రం అధిక టారిఫ్‌లకు మొగ్గు చూపుతూ, అమెరికా పరిశ్రమలను బలోపేతం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వైట్ హౌస్(White House) వర్గాలు ట్రంప్ బందాన్ని ఆధునిక అమెరికా చరిత్రలో అత్యుత్తమ వాణిజ్య బృందంగా అభివర్ణిస్తున్నాయి. ట్రంప్ సుంకాలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కెనడా, చైనా వంటి దేశాలు ప్రతీకార సుంకాలతో స్పందించగా, మరికొన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ భారం అమెరికా వినియోగదారులపై పడటంతో మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు(Econamists) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ వస్తువులపై ఆధారపడకుండా..
అయినప్పటికీ, ట్రంప్ ఈ విధానాన్ని సమర్థిస్తూ, విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని పేర్కొంటున్నారు. ఈ సుంకాల వ్యూహం విజయవంతమైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడవచ్చు, కానీ విఫలమైతే లుట్నిక్‌పై నిందలు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ దేశాల స్పందనలు, అమెరికా ఆర్థిక భవిష్యత్తు ఈ వివాదాస్పద నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి.