Trump Tariffs Impact: అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రంపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు ఇప్పుడు ఆ దేశానికే నష్టం చేస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో కలకలం రేపుతున్నాయి. ఈ ఏకపక్ష వాణిజ్య విధానాలు విదేశీ దిగుమతులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అమెరికన్ వినియోగదారులపైనే ఎక్కువ భారం పడుతోంది. దుస్తుల నుంచి రోజువారీ అవసర వస్తువుల వరకు ధరలు ఆకాశాన్ని అంటడంతో, అమెరికన్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ధరల పెరుగుదలను స్పష్టంగా చూపిస్తున్నాయి.
Also Read: ట్రంప్ – పుతిన్ మీటింగ్ షురూ! జరగబోయే పరిణామాలు ఏంటి ?
అమెరికన్లపైనే భారం..
ట్రంప్ టారిఫ్‌లు, ముఖ్యంగా చైనా, భారత్, కెనడా, మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన అధిక సుంకాలు, అమెరికాలో వస్తువుల ధరలను గణనీయంగా పెంచాయి. గతంలో 6 డాలర్లకు లభించిన దుస్తులు ఇప్పుడు 10 డాలర్లకు చేరాయి, అంటే దాదాపు 66% ధరల పెరుగుదల. ఇతర రోజువారీ వస్తువుల ధరలు కూడా 1 డాలర్ నుంచి 10 డాలర్ల వరకు పెరిగాయి. ఈ ధరల పెంపు సామాన్య అమెరికన్ కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ సుంకాల వల్ల అమెరికన్ కుటుంబాల వార్షిక ఖర్చు సగటున రూ. 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అమెరికన్లు సూపర్మార్కెట్లలో, దుకాణాల్లో ధరల షాక్‌ను రికార్డ్ చేస్తూ, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
టారిఫ్‌ల లక్ష్యం ఏంటి?
ట్రంప్ టారిఫ్‌ల ఉద్దేశం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, వాణిజ్య లోటును తగ్గించడం అని పేర్కొన్నారు. అయితే, ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని విశ్లేషకులు అంటున్నారు. చైనా నుంచి 34%, భారత్ నుంచి 26%, యూరోపియన్ యూనియన్ నుంచి 20% వంటి అధిక సుంకాలు విధించడంతో, దిగుమతి వస్తువుల ధరలు పెరిగాయి. ఈ ధరల పెంపు అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతోంది. ఈ టారిఫ్‌లకు ప్రతీకారంగా ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నాయి. కెనడా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధించింది. చైనా కూడా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తూ, ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తోంది. ఈ వాణిజ్య యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊహించని నష్టాన్ని కలిగిస్తోంది.
Also Read: తగ్గేదేలే.. ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన మోడీ..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌లు కేవలం అమెరికన్లకు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సుంకాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించి సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్ వంటి దేశాలు ఈ టారిఫ్‌లను ‘అన్యాయమైన‘ చర్యగా ఖండిస్తూ, ప్రతీకార చర్యలకు దిగాయి. ఇది అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో అలజడిని కలిగించింది. భారత్‌లో సెన్సెక్స్ 76,617 పాయింట్ల నుంచి 75,811 పాయింట్లకు పడిపోయింది, ఇతర ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. టారిఫ్‌ల వల్ల డాలర్ బాండ్ల మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది. జపాన్ వంటి దేశాలు వందల బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విక్రయించడం ప్రారంభించాయి, ఇది అమెరికా ఆర్థిక విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిణామాలు డాలర్ విలువను బలహీనపరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై 26% నుంచి 50% వరకు సుంకాలు విధించారు, దీనికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడమే కారణమని పేర్కొన్నారు. ఈ సుంకాలు భారత ఎగుమతులను దెబ్బతీసినప్పటికీ, కొన్ని రంగాలైతే లాభపడే అవకాశం ఉంది. చైనాపై అధిక సుంకాల వల్ల భారతీయ టెక్స్టైల్, ఫార్మా, ఆటోమొబైల్ విడిభాగాల రంగాలు అమెరికా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవచ్చు.
విజయమా, విఫలమా?
ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో విజయవంతం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సుంకాలు స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించే బదులు, వినియోగదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. అమెరికన్ ఆర్థిక వేత్తలు ఈ టారిఫ్‌లను ‘రెండు వైపులా పదునైన కత్తి‘గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, ఈ విధానాలు అమెరికా యొక్క అంతర్జాతీయ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి, ఇది దీర్ఘకాలంలో ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది.