Modi strong counter Trump: భారత్ పై మరో 25 శాతం టారిఫ్ లు విధిస్తూ మొత్తం 50 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మోడీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దేశం కోసం తగ్గేదేలే అంటూ అగ్రరాజ్య బెదిరింపులకు భయపడేది లేదంటూ పరోక్షంగా సవాల్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ ఆర్థిక వ్యవస్థను “డెడ్ ఎకానమీ”గా అభివర్ణించడమే కాకుండా, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ తెరవాలని ఒత్తిడి తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు నేరుగా పేరు చెప్పకుండా, పరోక్షంగా భారత్ తన రైతుల ప్రయోజనాల పట్ల ఎంత దృఢంగా ఉందో స్పష్టం చేశారు.
Read Also: పక్కనే ఈత కొడుతున్నాడు.. అందులోనే మూత్ర విసర్జన.. ఏం మనుషులు రా బాబూ
– మోదీ స్పందన “రైతుల ప్రయోజనాలపై రాజీపడం”
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల విషయంలో మేం రాజీపడం. దీనికి నేను వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా, అందుకు నేను సిద్ధమే” అని స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, దేశీయ వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంకేతాలు ఇచ్చాయి.
– ఆర్థిక విమర్శలపై గట్టి జవాబు
ట్రంప్ “డెడ్ ఎకానమీ” వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు “భారతీయుల కష్టం వెనుక ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయండి” అని పిలుపునిచ్చారు. ఇది దేశీయ తయారీ రంగంపై దృష్టి పెడుతున్నామన్న సంకేతాన్ని పంపింది.
-ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యం
ట్రంప్ ఇటీవల భారత్-రష్యా సంబంధాలపై విమర్శలు చేస్తూ రష్యా నుంచి భారత్ చమురును కొనడం వల్లే ఆ దేశం ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోందని.. వెంటనే భారత్ కొనుగోలు ఆపాలని ట్రంప్ బెదిరించారు. కానీ భారత్ మాత్రం నో చెప్పింది. ఇక భారత్, రష్యా ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలు “మృతావస్థలో” ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ఇవ్వకపోతే 25% సుంకాలు విధిస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ స్పందన వచ్చింది.
ఈ పరిణామాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, మోదీ వ్యాఖ్యల ద్వారా దేశీయ వ్యవసాయ రంగ ప్రయోజనాలపై భారత్ ఎంత దృఢంగా ఉందో స్పష్టమైంది.