Trump-Putin meeting: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో యుద్ధం ఆపేస్తానని అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రకటించాడు. ఆయన అధికారం చేపట్టి ఏడు నెలలు దాటింది. కానీ యుద్ధం ఆగలేదు. యుద్ధం ఆపేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా భారత్‌పై 50 టారిఫ్‌ల విధింపు కూడా ఇందులో భాగమే. కానీ యుద్ధం ఆగే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశం గ్లోబల్ రాజకీయ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడితో కలిసి ఈ భేటీ జరగనుందని పుతిన్ అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘24 గంటల్లో యుద్ధం ఆపుతాను‘ అని చేసిన వాగ్దానం నెరవేరకపోవడంతో, ఈ భేటీపై అంతర్జాతీయ దృష్టి నెలకొంది. ఈ సమావేశం యుద్ధాన్ని ముగించే మార్గం తెరుస్తుందా లేక ట్రంప్ రాజకీయ ఆటలకు వేదికగా మారుతుందా అన్నది ప్రధాన ప్రశ్న.
ట్రంప్ ప్రతిపాదనలు..?
ట్రంప్ ప్రతినిధి రష్యాతో చర్చల్లో భాగంగా నాలుగు కీలక ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలు, నాటో విస్తరణ, ఆంక్షల ఎత్తివేత, మరియు ఉక్రెయిన్ భద్రతా హామీల చుట్టూ తిరుగుతున్నాయి.
Read Also: మోడీ దేశం కోసం నిలబడ్డాడా.. రాజీపడ్డాడా?
1. ఆక్రమిత భూభాగాలు: రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 20% భూభాగాన్ని ఆక్రమించుకుంది, ఇందులో క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాలు ఉన్నాయి. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం, ఈ భూభాగాలను రష్యా వదులుకోవాలని, కానీ రష్యా దీనిని తిరస్కరిస్తోంది. ఈ అంశం ట్రంప్–పుతిన్ చర్చల్లో కీలకంగా మారనుంది. రష్యాకు అనుకూలంగానే ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
2. నాటో విస్తరణపై హామీ: ట్రంప్ ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవడాన్ని నిషేధించే హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పుతిన్‌కు అత్యంత అనుకూలమైన ప్రతిపాదన, ఎందుకంటే రష్యా ఎప్పటినుంచో నాటో యొక్క తూర్పు విస్తరణను వ్యతిరేకిస్తోంది.
3. ఆంక్షల ఎత్తివేత: రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు సమాచారం. యుద్ధం ముగిస్తే ఈ ఆంక్షలను తొలగించేందుకు అమెరికా సుముఖంగా ఉంది, ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశం.
4. ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు: ఉక్రెయిన్ అమెరికా నుంచి బలమైన భద్రతా హామీలను కోరుతోంది, కానీ రష్యా యూరోపియన్ గ్యారంటీలను పట్టించుకోవడం లేదు. ట్రంప్ ప్రతిపాదనలో, రష్యా అనుమతి మేరకే అమెరికా సైనిక సహకారం అందించే అవకాశం ఉంది, ఇది ఉక్రెయిన్‌కు నష్టం కలిగించే అంశంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిపాదనలు రష్యా డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయి. దీంతో ట్రంప్ పుతిన్ ముందు దాదాపు సరెండర్ అయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ట్రంప్ లక్ష్యం ఏమిటి?
ఉక్రెయిన్‌లో అరుదైన లిథియం, టైటానియం, యురేనియం వంటి ఖనిజ సంపద ఉంది. దీనిపై ట్రంప్ దృష్టిసారించారు. యుద్ధం ఆపితే ఈ ఖనిజాల తవ్వకం కోసం అమెరికాకు అనుమతి ఇస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందం ఉక్రెయిన్‌ను రష్యా అమెరికా మధ్య రాజకీయ ఆటలో పావుగా మార్చే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బలమైన భద్రతా హామీలు లేకుండా శాంతి స్థాపన అసాధ్యమని పేర్కొన్నారు.
Read Also: నభా నటేష్ అందాలకు కుర్రాళ్లు షాక్..
నోబెల్ శాంతి బహుమతి కల..
డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇమేజ్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన పాకిస్థాన్ సైనికాధికారి ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ట్రంప్ ఈ బహుమతి కోసం యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై దృష్టి సారించినప్పటికీ, ఆయన విధానాలు అమెరికన్ల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలపడుతున్నాయి.
ట్రంప్–పుతిన్ భేటీ ఫలితం?
ట్రంప్–పుతిన్ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా విజయవంతమైతే, ఇది ట్రంప్ రాజకీయ ఇమేజ్‌కు ఊతమిస్తుంది. అయితే, ఈ భేటీ విఫలమైతే, ట్రంప్‌కు అంతర్జాతీయంగా తీవ్ర అవమానం తప్పదు. పుతిన్ గతంలో ట్రంప్‌తో చర్చల తర్వాత కూడా ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగించారు, దీంతో ట్రంప్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. ఈ భేటీలో ఒప్పందం కుదిరితే, ఉక్రెయిన్ ఖనిజ సంపద అమెరికాకు లభించే అవకాశం ఉంది, కానీ ఉక్రెయిన్ సార్వభౌమత్వం మరియు భద్రతా హామీలు అనిశ్చితంగా మిగిలిపోతాయి.