H1B Visa: ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు తీసుకునే నిర్ణయాలు ప్రజలను అంతగా ఇబ్బంది పెట్టవు. ఎంతో కొంత ఉదారంగానే ఆ నిర్ణయాలు ఉంటాయి. కానీ ఒక వ్యాపారి రాజకీయ నాయకుడైతే.. అతడు తీసుకునే నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అవి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందువల్లే అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుడి కంటే.. వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరింత ప్రమాదం అని విశ్లేషకులు అంటుంటారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. తనదైన వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మొదట్లో అక్రమంగా ఉంటున్న వారిని వారి వారి దేశాలకు పంపించారు. ఆ తర్వాత టారిఫ్ ల కత్తి దూశారు. అది సరిపోలేదన్నట్టు హెచ్ వన్ బీ వీసా ల ఫీజు పెంచేశారు. ఏకంగా దానిని లక్ష డాలర్లు చేసేసారు. దీంతో అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగాలు రావని భయపడుతున్నారు. వాస్తవానికి ఈ పరిణామం భారత్ మీద తీవ్రంగా ఉంది. హెచ్ వన్ బి వీసాల ద్వారా అమెరికా వెళుతున్న వారిలో భారత విద్యార్థులు ముందుండగా.. ఆ తర్వాత స్థానంలో చైనా వారు ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత విద్యార్థులు భవిష్యత్తును తలుచుకొని ఇబ్బంది పడుతున్నారు. కొలువు గురించి ఆలోచిస్తూ కలత చెందుతున్నారు. వాస్తవానికి హెచ్1 బి వీసాల గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తు మీద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు ఎఫ్ వన్ వీసా మీద వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడే ఉండొచ్చు. మరో రెండు సంవత్సరాలు ఓపిటి ఎక్స్ టెన్షన్ సౌకర్యం ఉంటుంది. చదువు పూర్తి అయిన మూడు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పటికి అమెరికా ఆర్థిక పరిస్థితి మారకపోతే ట్రంప్ కాళ్ళ బేరానికి రాక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారిపోయింది. టారిఫ్ ల వల్ల రాబడులు పూర్తిగా తగ్గిపోయాయి. అందువల్లే హెచ్ వన్ బీ వీసా ఫీజులను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల భారీగానే ఆదాయం వస్తుందని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఆల్టర్నేటివ్ దేశాలకు కనక చైనీస్, భారత యువత వెళ్ళిపోతే అమెరికా ఆశించిన ఆదాయం రాదు. దీంతో ట్రంప్ తగ్గక తప్పదు. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇవేనని నిపుణులు అంటున్నారు.