UAE: యూఏఈలో అక్రమ వలసదారులకు ఇది గుడ్ న్యూస్.. దుబాయ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇదీ

గల్ఫ్‌ దేశం దుబాయ్‌.. ఉన్నత విద్యావంతులు ఉద్యోగాల కోసం అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్తుంటే.. తక్కువ చదువుకున్నవారు, కార్మికులుగా పనిచేసేవారు.. గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. భారత్‌ నుంచి చాలా మంది గల్ఫ్‌ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 2, 2024 11:23 am

UAE

Follow us on

UAE: ఎడారి దేశం దుబాయ్‌. కానీ, సంపన్న దేశమే. ఈ దేశంలో నిర్మాణరంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత్‌ నుంచి కార్మికులుగా పనిచేసేవారు ఎక్కువగా గల్ఫ్‌ దేశమైన దుబాయ్‌కు వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల మంది దుబాయ్‌లో ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ నుంచి చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లొస్తున్నారు. అయితే చాలా మంది ఏజెంట్లను ఆశ్రయించి దుబాయ్‌ వెళ్తున్నారు. కొందరు ఏజెంట్లు డబ్బులు తీసుకుని విజిట్‌ వీసాపై దుబాయ్‌కి పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా అక్కడకు వెళ్లిన అనేక మంది వీసా గడువు ముగిసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అక్రమంగా ఉంటున్నారు. పోలీసులకు పట్టుపడకుండా తల దాచుకుంటున్నారు. కొందరు పట్టుబడి జైల్లలో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈలో వీసా గడువు ముగిసి అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి స్థానిక ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈ (్ఖఅఉ) లోని భారతీయులకు సాయం చేసేందుకు అక్కడున్న భారత రాయబార కార్యాలయం కూడా ఓ అడ్వైజరీ జారీ చేసింది.

అక్టోబర్‌ 30 వరకు అవకాశం..
– ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబర్‌ 1, 20241 మొదలవుతుంది. రెండు నెలలపాటు (ఆక్టోబర్‌ 30, 2024) వరకు అందుబాటులో ఉంటుంది. పర్యటకులు, రెసిడెన్సీ వీసాతోపాటు వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్టేటస్‌ ను అప్డేట్‌ చేసుకోవాలి. లేదంటే ఎటువంటి జరిమానా, నిషేధాలు లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. యూఏఈలో జన్మించినప్పటికీ.. సరైన ధ్రువపత్రాలు లేనివారితోపాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే ఉంటున్న వారికీ ఇది వర్తిస్తుంది. అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు.

తిరిగి వెళ్లేవారికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌..
దుబాయ్‌ నుంచి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న వారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. రెసిడెన్సీ స్టేటస్‌ రెగ్యులరైజ్‌ చేసుకోవాలనుకునే వారు మాత్రం స్వల్పకాలిక పాస్పోర్టుకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు ఈసీని తీసుకోవచ్చని దుబాయ్‌ లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. వీటికోసం దుబాయ్‌ తోపాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను(బీఎల్‌ఎస్‌ సెంటర్లు) ఏర్పాటు చేశామని పేర్కొంది. వీటికోసం ముందస్తుగా ఎటువంటి అపాయింట్మెంట్‌ అవసరం లేదని తెలిపింది. వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అమల్లో ఉన్న వ్యవధిలో ఈ ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో ఉంటాయని భారత కాన్సులేట్‌ వెల్లడించింది.

సాధారణ ఫీజు చెల్లిస్తే రెసిడెన్సీగా అవకాశం..
దుబాయ్‌లో రెసిడెన్సీ చట్టం ప్రకారం అక్రమ వలసదారులు సాధారణ ఫీజు చెల్లిస్తే రెసిడెన్సీగా యూఏఈ ప్రభుత్వం అవ కాశం ఇస్తుంది. ఇందుకోసం సాధారణ ఫీజు చెల్లించి సరిదిద్దుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఏ సమస్యలు లేకుండా అక్రమ వలసదారులు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానా, జైలు శిక్షలేకుండా తిరిగి వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అక్కడే ఉండే అక్రమ వలస కార్మికులపై చట్టప్రకారం చర్య తీసుకుంటారు.

30 శాతం భారతీయులే..
ఇదిలా ఉంటే యూఏఈ జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రవాస భారతీయులే. దాదాపు అక్కడ 35 లక్షల మంది భారతీయులు నివాసముంటున్నట్లు అంచనా. వీరిలో 20 శాతం మంది అబుదాబీలో ఉండగా.. మిగతా 80 శాతం మంది దుబాయ్‌ సహా మిగతా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.