Mahabubabad: తెలంగాణలో వరదలు ఖమ్మం, మహబూబన్‌నగర్ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. పల్లెలు, పట్టణాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. ప్రజలు వరదలతో అవస్థలు పడుతున్నారు. రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిపోయవడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో సాయం కోసం అర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరదల్లో ప్రమాదకరంగా రోడ్లు దాటుతూ ప్రమాదాలబారిన పడుతున్నారు వాహనదారులు. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్లి.. ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో రాయపూర్‌కు చెందినప నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఆఫ్ క్రాప్ రెసిస్టెన్స్ సిస్టమ్ రీసెర్చ్‌కు చెందిన యువ శాస్త్రవేత్త నునావత్ అశ్విని గల్లంతయింది. అశ్విని స్వస్థలం ఖమ్మం జిల్లా గంగారం తండా. ఆమె తన తండ్రి నూనావత్ మోతీలాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
కొట్టుకుపోయిన కారు..
తండ్రి మోతీలాల్‌తో కలిసి అశ్విని ఆదివారం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు కారులో బయల్దేరింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం వద్ద పొంగిపొర్లుతున్న ఆకేరువాగు వద్ద కాసేపు ఆగారు. విమానానికి సమయం దగ్గర పడుతుండడంతో వాగులో నుంచి దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న ఆకేరువాగు వాగు వంతెన తెగిపోవడంతో వారి కారు వరద నీటిలో మునిగిపోయింది.
కుటుంబ సభ్యులకు చివరి కాల్..
వరదలో కొట్టుకుపోతూనే అశ్విని, మోతీలాల్ మెడలోతు నీటిలో చిక్కుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులకు కాల్ చేసి పరిస్థితిని తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే వారి ఆత్మీయులు భయాందోళనకు గురయ్యారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ఆకేరువాగు వంతెన సమీపంలో అశ్విని మృతదేహం లభ్యం కాగా, ఆమె తండ్రి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం మోతీలాల్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.