America: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు పై సొంత దేశంలోనే నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోవాలని ఎక్కువమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే అది రాజకీయ దురుద్దేశంతో కాదు. ఆయన వైఖరితో అగ్రరాజ్యం ఇబ్బందుల్లో పడుతుందని.. ప్రపంచ దేశాల వద్ద చులకన అవుతుందని ఎక్కువమంది భావిస్తున్నారు. అందుకే ఆయన అధ్యక్ష స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఆయన జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని.. వయోభారంతో చాలా విషయాలు మరిచిపోతున్నారు అన్న ఓ నివేదిక ఈ కలకలానికి కారణం. దీంతో అగ్రరాజ్యం అభిమానులు ఆందోళనతో గడుపుతున్నారు.
స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్ ఓ నివేదికను రూపొందించారు. అగ్రరాజ్య అధినేత బైడెన్ జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వృద్ధుడిగా నిర్ధారించారు. అప్పటినుంచి పెను దుమారం రేగుతోంది. అయితే ఈ ఆరోపణలను బైడెన్ ఖండించారు. తన జ్ఞాపక శక్తికి తిరుగు లేదని ప్రకటించారు. తన కొడుకు ఎప్పుడు చనిపోయారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకోలేకపోయారని ఓ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర భావోద్వేగానికి గురైన బైడెన్ తీవ్రంగా స్పందించారు. అటువంటి వ్యాఖ్యలను ఖండించారు. అయితే తన వయసు, మానసిక పరిస్థితిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు పలుమార్లు బైడెన్ ఇబ్బంది పడ్డారు. ఈజిప్టు నేతను మెక్సికో అధ్యక్షుడిగా చెప్పుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి బైడెన్ అంశం వివాదాస్పదంగా మారుతూ వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో అగ్ర నేత అధినేతగా బైడెన్ వ్యవహరించడం ఇబ్బందికరమని పశ్చిమ వర్జినియా ఆటార్ని జనరల్ పార్ట్ పాట్రిక్ మోరిసే అభిప్రాయపడ్డారు. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు ప్రత్యేక లేఖ రాశారు. ఇటీవల దేశాల పేర్లు విషయంలో ఆయన గందరగోళానికి గురికావడానికి ప్రస్తావించారు. దేశ అధ్యక్షుడిని అత్యవసర పరిస్థితుల్లో తప్పించడానికి ఉద్దేశించిన 25వ సవరణను అమలు చేయాలని కోరారు. 1965 లో మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య తర్వాత.. 1965లో కాంగ్రెస్ 25వ సవరణకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అధ్యక్షుడు శారీరకంగా, మానసికంగా ఫిట్ గా లేరని వైస్ ప్రెసిడెంట్, మిగతా క్యాబినెట్ సభ్యులు భావిస్తే ఆయనను పదవి నుంచి తొలగించే అధికారం ఉంది. ఇప్పుడు బైడెన్ విషయంలో 25వ సవరణ అమలు చేయాలని.. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరుగుతుండడం విశేషం.