Chandrababu: చంద్రబాబు మారినట్టే మారి.. మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇది బయట వారు చెబుతున్న మాట కాదు. సొంత పార్టీ శ్రేణులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి అన్ని అంశాలపై చంద్రబాబు ముందుగానే క్లారిటీ ఇస్తారని ప్రచారం జరిగింది. గతం మాదిరిగా నాన్చుడు ధోరణి ఉండదని అంతా భావించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే ఆయన మారలేదని తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 మంది సిట్టింగ్లను మార్చారు. మరో 30 మంది వరకు మార్చుతారని ప్రచారం జరుగుతోంది. అసంతృప్త నాయకులు పార్టీని వీడుతున్నా.. తనపై విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అదే చంద్రబాబు విషయానికి వచ్చేసరికి ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. పొత్తుల అంశం, అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ముందడుగు వేయకపోవడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్ర నేతలను కలిశారు. పొత్తులపై చర్చించారు. బిజెపి నేతలు కీలక ప్రతిపాదనలు చంద్రబాబు ఎదుట పెట్టారు. తమ స్థాయికి మించి టికెట్లను అడిగారు. కానీ తిరిగి వచ్చిన చంద్రబాబు టిడిపి శ్రేణుల అభిప్రాయాలను తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. బిజెపికి ఏం చెప్పారు.. బిజెపితో ఏం చర్చించారు.. అన్నది బయటకు రావడం లేదు. అసలు బిజెపి అడిగిన సీట్లకు సమ్మతించారా? ఆ పరిస్థితి ఉందా? అసలు పొత్తు ఉంటుందా? లేదా? అన్న విషయాలను తేల్చడం లేదు. మరోవైపు చూస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు ఆశావాహుల పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు. ఇది పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి కారణమవుతోంది.
గత ఎన్నికల్లో టిడిపికి 23 స్థానాలు వచ్చాయి. సంఖ్యాపరంగా తక్కువ స్థానాలే అయినా.. 40% ఓటింగ్ తో టిడిపి మంచి పనితీరునే కనబరిచింది. కానీ అటువంటి పార్టీ ఇప్పుడు పోటీ విషయంలో భయపడుతోంది. పొత్తులకు వెంపర్లాడుతోంది. జగన్ సర్కార్ పై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ పొత్తుల అంశం తేల్చడం విషయంలో మాత్రం విఫలమవుతున్నారు. గతం మాదిరిగా ఎన్నికల వరకు అభ్యర్థుల ఎంపికను తేల్చడం లేదు. ఇది తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పటికైనా చంద్రబాబు మారతారా? లేదా? అన్నది చూడాలి.