B-21 Raider Stealth Bomber: కేజీఎఫ్ _2 సినిమా చూశారా? అందులో రాఖీ సీబీఐ ఆఫీస్ ఎదుట ఫైరింగ్ చేస్తున్నప్పుడు.. చేతిలో అత్యాధునిక తుపాకీ ఉంటుంది. అందులో నుంచి బుల్లెట్లు నిప్పు రవ్వల్లా దూసుకొస్తుంటాయి. ఆ బుల్లెట్ల తాకిడికి ఎదురుగా ఉన్న వాహనాలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. దానికి ఆ సినిమాలో పెద్దమ్మ అని పేరు పెడతారు. సరిగ్గా అలాంటి యుద్ధ విమానాన్ని అమెరికా తయారుచేసింది. దాని పేరు బీ_ 21 రైడర్. అణు స్టెల్త్ బాంబర్ రకానికి చెందిన దీనిని పెంటగాన్ ఆవిష్కరించింది. ఇది ఆరో తరానికి చెందిన సైనిక యుద్ధ విమానం.. ఖరీదు 6,132 కోట్ల వరకూ ఉంటుంది.

ఎందుకు తయారు చేసిందంటే..
అమెరికా దేశం తెలుసు కదా.. గిచ్చి కయ్యం పెట్టుకునే రకం. ఇరాన్, ఇరాక్, పొరుగున ఉన్న దేశాలు.. ఇలా వేటితోను కూడా పెద్దగా సయోధ్య లేదు. పైగా చైనా లెక్క చేయడం లేదు. రష్యా లెక్కపెట్టడం లేదు. ఒపెక్ దేశాలు కాలర్ ఎగరేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే, తన ప్రయోజనాలకు భంగం వాటిల్లితే అమెరికా కోరుకునేది యుద్ధాన్నే కాబట్టి.. శత్రువు మీద విజయం సాధించాలి కాబట్టి… అధునాతన ఆయుధాలను తయారు చేసుకుంటున్నది. దేశం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా ఆయుధాలు తయారు చేస్తున్నది.
ఏంటి దీని ప్రత్యేకత
ఆరో తరానికి చెందిన సైనిక విమానం న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బీ_ 21 రైడర్ ను కాలిఫోర్నియాలోని ఫామ్ డెల్ వైమానిక స్థావరంలో ఆవిష్కరించారు. గత 30 సంవత్సరాలలో అమెరికా అభివృద్ధి చేసిన కొత్త బాంబర్ విమానం ఇదే కావడం విశేషం. ఒక్కో యుద్ధ విమానం ఖరీదు ₹6వేల కోట్ల పైచిలుకు ఉంటుంది. అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యం ఈ యుద్ధ విమానాల సొంతం. ప్రపంచంలో ఎక్కడైనా పూర్తి కచ్చితత్వంతో, శతృదేశాల రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలిగే శక్తి దీనికి ఉంటుంది. ఇప్పటివరకు రూపొందించిన యుద్ధ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనదని దీని నిర్మాణ సంస్థ నాథ్రోప్ గ్రమ్మన్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.

దీనివల్ల ఏమవుతుంది
సంప్రదాయ అణ్వస్త్రాలతో పాటు లేజర్ ఆయుధాలను కూడా ప్రయోగించే సామర్థ్యం ఈ యుద్ధ విమానం సొంతం.. ఇప్పటివరకు అమెరికా కు అందుబాటులో ఉన్న స్టెల్త్ బాంబర్ బీ_ 2 స్పిరిట్ విమానాల స్థానాన్ని బీ_ 21 రైడర్లు భర్తీ చేసే అవకాశం ఉంది.. ప్రారంభంలో ఆరు బీ _21 రైడర్లు సిద్ధం చేస్తున్నారు. వీటి సంఖ్యను వందకు పెంచాలని అమెరికా వైమానిక దళం యోచిస్తోంది. 2023 ప్రారంభంలో ఈ యుద్ధ విమానాల సేవలు అమెరికాకు అందుబాటులోకి వస్తాయి.. డ్రాగన్ తోపాటు ఇతర దేశాలతో వివాదాలు ఉన్న నేపథ్యంలో వీటితో దీటైన సమాధానం ఇవ్వచ్చని అమెరికా భావిస్తున్నది.