Taj Mahal Incident: ఎవరు అయిన వాళ్ళు.. ఎవరు బంధువులు.. పెంచుకున్న ప్రేమ మిథ్య.. అల్లుకున్న బంధం మిథ్య.. రక్తసంబంధం అబద్ధం. ప్రేమా అబద్ధం.. డబ్బుతో ముడిపడి ఉన్న నేటి రోజుల్లో.. డబ్బే పరమార్ధంగా భావిస్తున్న నేటి కాలంలో.. మనిషి అనే వాడు ఒక వస్తువు మాత్రమే.. అవసరానికి పనికివచ్చే వాడు మాత్రమే. కష్టకాలంలో.. కన్నీళ్లు ఉబికి వచ్చే కాలంలో వదిలించుకోవడమే నేటి ఆనవాయితీ. కావాలంటే వృద్ధాశ్రమాలు చూడండి.. ఎంతమంది తల్లిదండ్రులు కనిపిస్తారో.. అనాధ ఆశ్రమాలను పరిశీలించండి.. ఎంతమంది అక్కడ దీనంగా ఉంటారో.. చివరికి జంతువులు కూడా ఇలా చేయవు. కాటికి కాలు చాపిన కాలంలో చేదోడుగా ఉంటాయి. వాదోడును చూపిస్తుంటాయి. కానీ మనిషి మాత్రమే కర్కశంగా.. కఠినంగా.. దయ లేకుండా ఉంటాడు. ఉంటూనే ఉన్నాడు.
Also Read: పిఠాపురంలో వర్మను నమ్ముకున్న వైసిపి..’గీత’ దాటనున్నారా?
ఆ వృద్ధుడి వయసు 80 సంవత్సరాలు.. ఏ ప్రాంతమో తెలియదు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. శరీరం వణుకుతోంది. చూపు పూర్తిగా మందగించింది. కుర్చీలో కూడా కూర్చోలేని దుస్థితి. అటువంటి వ్యక్తిని ఓ కారులో తీసుకొచ్చారు. తాజ్ మహల్ చూసేందుకు కుటుంబ సభ్యులు వెంటపెట్టుకొని వచ్చారు. వారేమో తాజ్ మహల్ చూసేందుకు వెళ్లారు. అతడినేమో కారులో ఉంచారు.. కారు అద్దాలు మొత్తం వేసి వెళ్ళిపోయారు.. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఆ ముసలి వ్యక్తి కొట్టుకున్నాడు. శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. ఒక రకంగా నరకం చివరి అంచుదాక వెళ్ళాడు. అదే ప్రాంతంలో ఉన్న కొంతమంది కారు కదులుతున్న దృశ్యాన్ని చూశారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడదాకా వచ్చారు. కారు అద్దంలో నుంచి చూస్తే ముసలి వ్యక్తి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. తట్టుకోలేక.. అతని బాధ చూడలేక కారు అద్దాలు బద్దలు కొట్టారు. అతడికి ఒక్కసారిగా పునర్జన్మ ప్రసాదించారు. అతడు గుండెల నిండా గాలి పీల్చుకొని.. బతికాను దేవుడా అనుకుంటూ దండం పెట్టుకున్నాడు.
ఈ దయనీయ దృశ్యం ఆగ్రాలో చోటుచేసుకుంది. తాజ్ మహల్ చూడడానికి ముంబై నుంచి ఓ కుటుంబం కారులో వచ్చింది. ఆ కారులో తమ కుటుంబ పెద్దను కూడా తీసుకొచ్చింది. ఆ కుటుంబ పెద్ద కు 80 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. వృద్ధాప్యం వల్ల అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒక రకంగా అతడిని వదిలించుకోవడానికి కుటుంబ సభ్యులు ఇక్కడ దాకా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. తమ ఉన్నతి కోసం ఎంతో కృషి చేసినప్పటికీ.. ఎంతగానో కష్టపడినప్పటికీ చరమాంకంలో అతడికి తోడుగా ఉండాలి అనే కనీస స్పృహని కూడా పక్కనపెట్టి.. తాము కూడా మనుషులమే అనే సోయిని వదిలిపెట్టి.. కర్కశంగా వ్యవహరించారు. కారు అద్దాలు మూసి.. శ్వాస ఆడకుండా చేసి చంపాలని చూశారు. కానీ భగవంతుడు చుట్టుపక్కల వారి రూపంలో అతడికి ఆయుష్షును ప్రసాదించాడు. దీంతో ఆ వృద్ధుడు చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు.. గుండెల నిండా గాలి పీల్చుకొని.. బతికాను దేవుడా అంటూ దేవుడికి దండం పెట్టుకున్నాడు.
Also Read: రిషబ్ పంత్: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో దర్శనమిస్తోంది. మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారో.. కుటుంబ సభ్యులను వదిలించుకోవడానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈ వీడియో కళ్ళకు కడుతోంది. డబ్బు కోసం.. వెంపర్లాడుతున్న తీరులో కనీసం ఒక్క శాతం కూడా కుటుంబ సభ్యులకు కేటాయించని దీనత్వాన్ని కళ్ళకు కట్టేలా చూపిస్తోంది.