Rishabh Pant Injury Update: 425.. ప్రస్తుత అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన పరుగులు.. ఈ సిరీస్లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా పంత్ కొనసాగుతున్నాడు.. ఇప్పటికే అతడు రెండు సెంచరీలు చేశాడు. అర్థ సెంచరీలు కూడా రెండు దాకా చేశాడు.. భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.. ముఖ్యంగా మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టీం ఇండియాకు అవసరమైన సందర్భంలో నిలబడ్డాడు.. దాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో అతడు తేలిపోవడం టీమిండియా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక రకంగా పంత్ కనుక నిలబడి ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరో విధంగా ఉండేది.
రిషబ్ పంత్ మిగతా ఫార్మాట్ లలో పక్కన పెడితే సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం అతడు బీభత్సంగా ఆడతాడు. అతడు చేసిన పరుగులలో టెస్ట్ ఫార్మాట్ నుంచే ఎక్కువగా వచ్చాయి. అందువల్లే అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు.. ఈ సిరీస్లో అతడు కీలకమైన ఆటగాడిగా కూడా ఆవిర్భవించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇటీవల మూడో టెస్టులో బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి చిటికెన వేలుకు గాయం కావడంతో కీపింగ్ చేయలేదు. అతడి స్థానంలో ధృవ్ జూరెల్ వికెట్ కీపింగ్ చేశాడు. నాలుగో టెస్ట్ కు జట్టుకు 8 రోజుల విరామం లభించింది. ఇంతటి విరామం వచ్చినప్పటికీ అతడు కోలుకోవడం కష్టమని జట్టు వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు అతని స్థానంలో జూరెల్ తో వికెట్ కీపింగ్ చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. పంత్ మాత్రం బ్యాటర్ గా కొనసాగుతాడని చెబుతున్నారు. ఒకవేళ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ ఉంటే పంత్ కు ఇబ్బంది కాదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అతడి వేలికి విశ్రాంతి కావాలని.. విశ్రాంతి ఉంటేనే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అతడు జట్టుకు విలువైన ఆటగాడు కాబట్టి.. కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉంటుంది. అలాంటప్పుడు అతని స్థానంలో మరొక ఆటగాడికి చోటు ఇవ్వాలని రవి శాస్త్రి చెబుతున్నాడు.
Also Read: ఆ ఉద్యోగులపై వేటు.. టిటిడి సంచలనం!
తొలి టెస్టులో తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ కు అవకాశం ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్ లో అతడు 0 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడిని రెండు టెస్టులకు దూరం పెట్టారు.. రెండు, మూడవ టెస్టులో కరణ్ నాయర్ కు చోటు కల్పించారు. అతడు వచ్చిన అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేదు. అలాంటప్పుడు నాయర్ ను పక్కనపెట్టి సాయి సుదర్శన్ కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పంత్ గాయపడ్డాడు కాబట్టి అతనికి విశ్రాంతి ఇచ్చి.. జూరెల్ ను అతని స్థానంలో తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు మరో బౌలర్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కీలక దశలో వికెట్లు తీయకపోతే అది జట్టు విజయం మీద తీవ్రంగా ప్రభావితం చూపిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు.. ” పంత్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంగ్లాండ్ బౌలర్లు పంత్ వేలును లక్ష్యంగా చేసుకొని బంతులు వేసే అవకాశం ఉంది. అది జట్టుకు మరింత ప్రమాదం. అలాంటప్పుడు అతడిని నాలుగో టెస్ట్ కు దూరంగా పెట్టాలి. అతని స్థానంలో ప్రత్యేకమైన బ్యాటర్ కు అవకాశం ఇవ్వాలి. పంత్ ను ఆడించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని” సీనియర్ ప్లేయర్లు సూచిస్తున్నారు.