US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్ 5న ఎన్నికలు జరుగనున్నాయి. పది రోజులే సమయం ఉండడంతో ప్రచారాన్ని తారాతాయికి తీసుకెళ్లారు అభ్యర్థులు. తుది విడత ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తునే.. వ్యక్తిగత విమర్శలూ చేసుకుంటున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఇంటర్వ్యూ వీడియోపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్, పుతిన్ దోస్తానీపైన కమలా ఆరోపణలు చేశారు. ట్రంప్‌కు మతిమరుపు పెరుగుతోందని ఆరోపించారు. ఇక ఇద్దరు అభ్యర్థుల తరఫున ప్రముఖులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతోనే ఇద్దరు నేతలూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కాబోయే అధ్యక్షుడు ఎవరో తేల్చేందుకు పలు సంస్థలు చేస్తున్న సర్వేలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇద్దరి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండడం.. తరచూ అది మారుతుండడంతో గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. తాజా సర్వేలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాయి.
లీడ్‌లోకి ట్రంప్..
తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది. డెమొక్రటిక్‌పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. పోటీ ఇద్దరి మధ్య కొనసాగుతోంది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్‌నకు 47 శాతం ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 45 శాతం ఓట్లు వచ్చాయి. 2 శాతం ఓట్ల తేడాతో ట్రంప్ లీడ్‌లోకి వచ్చారు. అయితే సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 ఉంటుందని అంచనా. సెప్టెంబర్ వరకు రేసులో వెనుకబడిన ట్రంప్ అనూహ్యంగా లీడ్‌లోకి వచ్చారు.
స్వరం పెంచిన నేతలు..
ఇదిలా ఉంటే.. తుది విడత ఎన్నికల ప్రచారంలో ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్‌పై కమలా హారిస్ విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్టు కాదని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్‌కు నచ్చదని పేర్కొన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణాన్ని గతంలో ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు. గతవారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువుగా పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలను ట్రంప్ కూడా తిప్పి కొట్టారు.