Jeevan Reddy’s Path: జీవన్ రెడ్డికి దారేది.? కాంగ్రెస్ లో కొనసాగుతాడా? లేదా?

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం హాట్‌హాట్‌గా నడుస్తోంది. తన అనుచరుడు గంగారెడ్డి హత్యను జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. హత్య జరిగిన నాటి నుంచి అటు కాంగ్రెస్ పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఫాలో అవుతుందని విమర్శలు చేస్తూ వచ్చారు

Written By: Srinivas, Updated On : October 25, 2024 12:04 pm

Jeevan-reddy

Follow us on

Jeevan Reddy’s Path: కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం హాట్‌హాట్‌గా నడుస్తోంది. తన అనుచరుడు గంగారెడ్డి హత్యను జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. హత్య జరిగిన నాటి నుంచి అటు కాంగ్రెస్ పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఫాలో అవుతుందని విమర్శలు చేస్తూ వచ్చారు. మర్డర్ జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఆయన చల్లబడలేదు. దాంతో సొంత పార్టీలోని సీనియర్ నేత వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలా తయారైంది. చివరకు జీవన్ రెడ్డి ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

ఫిరాయింపుదారుల వల్లనే తన అనుచరుడు హత్యకు గురయ్యాడని జీవన్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తున్నారు. అందుకే.. మర్డర్ జరిగిన రోజే కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఆయన తన అనుచరులతో కలిసి రాస్తారోకోకు దిగారు. ఆ సమయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వచ్చి బుజ్జగించినా ఆయన వినిపించుకోలేదు. పార్టీలో కొనసాగేది లేదంటూ తేల్చిచెప్పారు. గత ఆరు నెలలుగా పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని, మీ పార్టీకో దండం.. మీకో దండం అని ఆవేదన చెందారు. అటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసినప్పటికీ పెద్దగా స్పందించలేదు. దీంతో జీవన్ తో మాట్లాడే బాధ్యతను మరో మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి తప్పుబట్టారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి లేఖ రాసినట్లు వివరించారు.

అంతటితో ఆగకుండా.. ఫిరాయింపుదారులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపైనా జీవన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని కామెంట్స్ చేశారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. కాంగ్రెస్ సంఖ్యా బలంగానూ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తోందని నిలదీశారు. మంచి మెజార్టీని ఇచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నారని, ఇలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే వారిలో పార్టీపై ఉన్న నమ్మకం పోతుందని అన్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నాడు రాజీవ్ గాంధీ పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. అంతటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, అయినా కొన్ని స్వార్థపూరతశక్తులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదంటూ ఆరోపించారు. ఎవరి అండ చూసుకొని పట్టపగలే తన అనుచరుడిని హత్యచేశారని నిలదీశారు. ఇప్పటికైనా పార్టీ వైఖరి తెలపాలని, లేదంటే తన భవిష్యత్ కార్యాచరణ చూసుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి కేసీఆర్ దౌర్జన్యాలపై శాసనమండలిలో ఒంటరిగా పోరాడానని తెలిపారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. భరిస్తూ బతకాలా అని నిలదీశారు. తాను పార్టీ రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయలేదని స్పష్టం చేశారు. మొత్తానికి జీవన్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ నిరసనను ఎలా చల్లబరుస్తారని ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి మాత్రం తన డిమాండ్‌పై ఎక్కడా వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతున్నారు. మొదటి నుంచి ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.