Sheikh Hasina : మిస్టరీగా షేక్‌ హసీనా రాజీనామా లేఖ.. మళ్లీ అల్లర్లకు అదే కారణం!

మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. మూడు నెలల క్రితం చెలరేగిన అల్లర్లకు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపారిపోయారు. ఇప్పుడు ఆ రాజీనామానే మరోమారు అల్లర్లకు కారణమైంది.

Written By: Raj Shekar, Updated On : October 23, 2024 9:28 pm

Sheikh Hasina

Follow us on

Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో మూడు నెలల క్రితం రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లు.. ప్రధాని షేక్‌ హసీనా పదవికి ఎసరు తెచ్చాయి. విద్యార్థుల ఆగ్రహంతో ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశం వీడాల్సి వచ్చింది. అక్కడ తాజాగా మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. ఈసారి ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహాబుద్దీన్‌ను తప్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అధ్యక్ష భవనం ‘బంగాభబన్‌’ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. తాజా అల్లర్లకు షేక్‌ హసీనా రాజీనామా లేకనే కారణం అయింది. రాజీనామా లేఖ గురించి అధ్యక్షుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే తాజా దుమారానికి కారణం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్న వేళ.. తాజా వివాదానికి అధ్యక్షుడు కారణమయ్యారు. మూడు నెలల క్రితం చెలరేగిన అల్లర్లతో ఆ దేశంలోని మైనారిటీలు అయిన హిందువులపై దాడులు జరిగాయి. ఆలయాలను కూల్చివేశారు. పలువురిని చంపేశారు. ఈ నేపథ్యంలో తాజా అల్లర్లు ఎంతవరకు వెళ్తాయో అన్న ఆందోళన బంగ్లాదేశీయుల్లో నెలకొంది.

ఏం జరిగిందంటే..
బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో షేక్‌ హసీనా రాజీనామా అంశం ప్రస్తావించారు. ‘ఆ రోజు షేక్‌హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు విన్నాను. ఇప్పటికీ దానిని ధ్రువీకరించలేదు. నా దగ్గర రాజీనామా లేఖతోపాటు ఎలాంటి ఆధారాలు లేవు. ఎంత ప్రయత్నించినా ఆ లేఖ నాకు దొరకలేదు. మహుశా లేఖ ఇచ్చేందుకు ఆమెకు సమయం ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నారు. ఈ విషయమై సైన్యాధ్యక్షుడిని వాకబు చేయగా అక్కడి నుంచి కూడా ఇదే విధమైన సమాధానం వచ్చిందని తెలిపారు. హసీనా రాజీనామా లేఖ లేదని, ఆమోదం పొందలేదని అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలే తాజాగా దుమారానికి కారణమయ్యాయి. అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడారని ప్రస్తుత ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తెలిపారు. ఆగస్టు 5న జాతిని ఉద్దేశించి అధ్యక్షుడు చేసిన ప్రసంగంలో హసీనా రాజీనామా వేశారని.. తాను ఆమోదించానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు లేఖ లేదనడం సరికాదని పేర్కొన్నారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..
ఇదిలా ఉంటే.. జూలైలో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో ఆదేశం అట్టుడికింది. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వందల మంది చనిపోయారు. నిరసనకారులు షేక్‌ హసీనా అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆగస్టు 5న దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. అనంతరం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులు కుదుట పడుతున్న వేళ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు ఉప సంహరించుకుంటారా.. లేక సమర్థించుకుంటారా.. నిరసనలు ఎందాక వెళ్తాయి అన్న ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశీయులను టెన్షన్‌ పెడుతోంది.