Bus service from India to London : ఇండియా నుంచి లండన్‌కు బస్ సర్వీస్ ఉందా.. లండన్‌కు విమాన మార్గం, సముద్ర మార్గం ఉందని అందరికీ తెలుసు. కానీ, బస్ సర్వీస్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ, స్వాతంత్య్రం వచ్చాక.. ఐదారేళ్లపాటు బస్ సర్వీస్ నడిపారు. మరి ఈ బస్సు ఎలా వెళ్లేది.. అందులో ఏయే సౌకర్యాలు ఉండేవి.. ఎంత ఖర్చు అయ్యేది అనే సందేహాలు కూడా వస్తాయి కదా.. మరి ఈ ఇండియా – లండన్ బస్సు కథా కమామిషు తెలుసుకుందాం. మన దేశం నుంచి బ్రిటన్ రాజధాని లండన్‌కు స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత అంటే.. 1957లో బస్ సర్వీస్ ప్రారంభమైంది. ఆల్బర్ట్ ట్రావెల్స్ ఈ బస్సులు నడిపింది. ఈ బస్సు నడిచే రూల్‌ను హిప్పీ రూట్ అనేవారు. సుమారు పది వేల మైళ్లు ఈ బస్సులో పోయి వచ్చేవారు.
బస్ రూట్ ఇలా..
బ్రిటన్ నుంచి మొదట వలస వచ్చిన వారు ఎక్కువ మంది కోల్‌కత్తా చేరేవారు అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీని కోల్‌కతా వ్యాపార కేంద్రంగానే కాక వాళ్ల తొలి రాజధానిగా కూడా మార్చుకున్నారు. అందుకే అక్కడ ఇంగ్లిష్ వాళ్లు ఎక్కువగా ఉండేవారు. దీంతో ఈ ఆల్బర్ట్ ట్రావెల్స్ సంస్థ ఇండియా నుంచి లండన్‌కు బస్ సర్వీస్ ప్రారంభించింది. కోల్‌కత్తా నుంచి బయల్దేరే బస్సులు పశ్చిమ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూగోస్వియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, బెల్జియం, యూరప్ మీదుగా లండన్ వరకు వెళ్లేది. భారత్‌లోకి వచ్చిన తర్వాత న్యూ ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, కాశీ మీదుగా కోల్‌కతాకు చేరుకునేంది.
ఒక్క ట్రిప్‌కు 50 రోజులు..
బస్సు లండన్ నుంచి కోల్‌కత్తా చేరడానికి సుమారు 50 రోజులు పట్టేది. ఈ రెండు నగరాల మధ్య దూరం 10 వేల మైళ్లు. కిలోమీటర్లలో చెప్పాలంటే 16,100 కిలో మీటర్లు. అంటే ఒక్క ట్రిప్ వెళ్లి రావడానికి దాదాపు 20,300 మైళ్లు(32,669 కిలోమీటర్లు) ప్రయాణించాల్సి వచ్చేది. ఈ బస్ సర్వీస్ 1976 వరకు కొనసాగింది.
ఖర్చు ఎంతంటే..
భారత్–లండన్ బస్ ట్రిప్‌లో ఒకసారి ప్రయాణించడానికి 1957లో 85 పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.9 వేలు ఖర్చయ్యేది. 1973 నాఇకి వన్ వే ట్రిప్ కోసం 145 పౌండ్లకు(భారత కరెన్సీలో రూ.16 వేలకు) ఖర్చు పెరిగింది. ఈ ఖర్చులో మొత్తం ఆహారం, ప్రయాణం, వసతి ఉండేవి. ఆల్బర్ట్ ట్రావెల్స్ బస్సు తొలి ప్రయాణం 1957, ఏప్రిల్ 15న లండన్‌లో ప్రారంభమైంది. 50 రోజుల తర్వాత అంటే జూన్ 5న బస్సు కోల్‌కత్తాకు చేరుకుంది. ఇంగ్లండ్ నుంచి బయల్దేరిన బస్సు బెల్జియం, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాయవ్య భారత దేశం మీదుగా ఇండియాలోకి ప్రవేశించింది. ఇండియాలో ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా కోల్‌కత్తాకు చేరుకుంది.
బస్సులో సౌకర్యాలు ఇవీ..
భారత్–లండన్ బస్సులో చదువుకునేందుకు పుస్తకాలు, ప్రయాణికులందరికీ ప్రత్యేక స్లీపింగ్ బంక్‌లు, ఫ్యాన్లు, హీటర్లు, వంటగది ఉండేవి. ఈ బస్సుపైన డెక్‌లో కూర్చుని పరిసరాలను చూసేలా లాంజ్ కూడా ఉండేది. ఈ జర్నీ అంతా కేవలం ట్రిప్ కంటే ఓ టూర్‌లా సాగేది. బస్సులోపల రేడియో, మ్యూజిక్ సిస్టం కూడా ఉండేవి. భారత్‌లో ప్రయాణికులకు కాశీని చూపించడంతోపాటు ఆగ్రాలో తాజ్‌మహల్ ఇతర పర్యాటక ప్రదేశాల్లో గడిపే టైం ఇచ్చేవారు. ఇక మార్గ మధ్యంలో టెహ్రాన్, స్టాల్‌బర్గ్, కాబూల్, ఇస్తాంబుల్, వియన్నాలో షాపింగ్ చేసుకునే అవకాశం ఉండేది.
హిప్పీ రూట్‌గా ప్రసిద్ధి..
ఇక లండన్–భారత్ బస్సు రూట్‌ను హిప్పీ రూట్‌గా పిలిచేవారు. 1976 వరకు బస్సులు తిరిగాయి. 1976 తర్వాత ఈ బస్సులకు ఆదరణ తగ్గింది. ట్రావెల్స్ వారికి కూడా ఆసక్తి లేకపోవడంతో సర్వీస్‌లు ఆగిపోయాయి. హిప్పీ రూట్‌లో మొదట నడిపిన బస్సును బ్రిటిష్ యాత్రికుడు ఆండీ స్టీవర్ట్ కొనుగోలు చేశాడు. ఈ బస్ పురావస్తును ప్రదర్శనలో ఉంచారు. ఈ బస్సు ఆగిపోవడానికి ఇరాన్‌లో రాజకీయ విప్లదం, పాకిస్తాన్–ఇండియా మధ్య ఉద్రిక్తతలు కూడా కారణం
తాజాగా పునరుద్ధరణకు ప్రయత్నం..
తాజాగా ఇండియాకు చెందిన ఓ సంస్థ పంజాబ్ నుంచి లండన్‌కు బస్ సర్వీస్ నడపాలని ప్రయత్నించింది. అయితే హిప్పీ రూట్‌లో కాకుండా సిల్క్ రూట్‌లో నడిపేలా అనుమతులు తీసుకుంది. అయితే ఖరీదు దాదాపు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు అవుతుందని అంచనా వేసింది. లండన్ ఎపిక్ జర్నీ పేరిట బస్ సర్వీస్ ప్రారంభించేందుకు 2020లో ఏర్పాట్లు చేసింది. ఈ జర్నీ 70 రోజులు పడుతుందని అంచనా వేసింది. 18 దేశాల మీదుగా 20 వేల కిలోమీటర్లు ప్రయాణం సాగుతుందని తెలిపింది. అయితే కోవిడ్ కారణంగా బస్సు ప్రారంభం కాలేదు.