Pakistan Jaffer Express: జఫర్ ఎక్స్‌ఫ్రెస్.. పాకిస్తాన్‌లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. అన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైలు. ఆర్మీ జవాన్లు ఎక్కువగా ప్రయాణించే రైలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైలు ఏడాదిగా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ గడిచిన ఏడాది కాలంలో ఆరుసార్లు ఈ రైలుపై దాడిచేసింది. ఇక తాజాగా అక్టోబర్ 7న పాకిస్తాన్‌లోని సింద్ రాష్ట్రం సమర్వా సమీపంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బాంబు పేలుడుతో పట్టాలు తప్పింది. దాడి జరిగిన వెంటనే బాద్యత తమదే అని ప్రకటించే బీఎల్‌ఎఫ్ ఈసారి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తాజా దాడిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది ఏడు దాడులు
క్వెటా నుంచి బయల్దేరిన ఈ రైలు బలూచిస్తాన్, సింద్, పంజాబ్ దాటి ఖైబర్ పక్తూన్‌ఖ్వా వరకు వెళ్తుంది. దేశవ్యాప్తంగా దళసిబ్బంది ఈ రైలును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది తరచూ ఉగ్రవాద దాడుల లక్ష్యంగా మారుతోంది. అధికారికంగా కొద్దిమంది గాయాలే నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపినా, అనధికార వర్గాలు గణనీయమైన ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నాయి.
దాడులు ఇలా..
నవంబర్ 2024 నుంచి 2025 అక్టోబర్ వరకూ ఇదే రైలుపై ఏడు సార్లు దాడులు జరిగాయి.
– నవంబర్ 2024న క్వెటా రైల్వే స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. 32 మంది ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. 55 మంది గాయాలు.
– మార్చి 2025న బోలన్ సొరంగంలో రైలును హైజాక్ చేశారు. సుమారు 200 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) హతమార్చినట్లు ప్రకటించింది.
– జూన్ 2025న జాకోబాబాద్‌లో ఐఈడి పేలుడు జరిగింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు దెబ్బతిన్నా ప్రాణనష్టం వివరాలు వెల్లడించలేదు.
– ఆగస్టు 2025న మస్తుంగ్ ఘటనతో పాటు పైలట్ ఇంజిన్‌పై దాడి జరిగాయి. బాధ్యత బీఎల్‌ఏ ప్రకటించింది.
– అక్టోబర్ 2025న సింద్ సమీపంలో బాంబుదాడి జరిగింది. ప్రాణ నష్టం వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.
ఆర్మీ సిబ్బంది లక్ష్యం?
పాకిస్తాన్ సైన్యంలో పంజాబీ వర్గం ఆధిపత్యం బలంగా ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కూడా అదే తీరుంది. బలూచ్ వేర్పాటువాద గ్రూపులు ఇలాంటి పరిస్థితిని ‘పంజాబ్ ఆధిపత్యం‘గా భావించి ప్రతీకార దాడులు సాగిస్తున్నాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దీనివల్లే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి.
తాజాదాడిపై అనుమానాలు
తాజా దాడి తరువాత ఆసక్తికర అనుమానాలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్‌లోని రేర్ మినరల్స్‌ను పాకిస్తాన్ ఒకేసారి చైనా, అమెరికా రెండింటికీ విక్రయిస్తుండడం ఉద్రిక్తతకు దారితీస్తుందనే మాట ఉంది. పస్ని పోర్టును (గ్వాదర్‌కు 70 కి.మీ దూరం) అమెరికాకు అప్పగించడంపై చైనా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో దాడి వెనుక బీఎల్‌ఏ కాకుండా చైనా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా బలూచిస్తాన్ ప్రాంతంలో అడుగుపెట్టొద్దని సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ వరుస దాడులు పాకిస్తాన్‌లో అంతర్గత అస్థిరత, వేర్పాటు వాద హింస, చైనా–అమెరికా భౌగోళిక ప్రత్యర్థిత్వం అంతా కలసిన సంక్లిష్ట సమీకరణాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఈ రైలుపై మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున, ఇది కేవలం భద్రతా సమస్య కాదు.. రాబోయే నెలల్లో పాక్ భౌగోళిక, రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం అవుతుంది.