Donald Trump : డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన కొద్ది గంటల తర్వాత.. చైనాలో సంచలనం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కలకలం నెలకొంది. పెన్సిల్వినియా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉండగా.. ఓ దుండగుడు సమీప భవనం పై కప్పు ఎక్కి.. ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. తర్వాత 5 షాట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి పక్క నుంచి దూసుకుపోయింది.

Written By: Bhaskar, Updated On : July 14, 2024 9:56 pm
Follow us on

Donald Trump :  ఆధునిక ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తులుగా అమెరికా – చైనా కొనసాగుతున్నాయి. శ్వేత దేశాన్ని అధిగమించాలని డ్రాగన్ ఎప్పటి నుంచో కాచుకొని ఉంది. అందుకే అమెరికాకు మించి తన తయారీ రంగాన్ని బలోపేతం చేసుకుంది. చివరికి అమెరికా కూడా తనపై ఆధారపడేలా చైనా ఎదిగింది. మొదట్లో ఇది బాగానే ఉన్నప్పటికీ.. చైనా అసలు ప్రణాళిక తెలిసి అమెరికా దూరం జరగడం మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు చైనాతో వ్యాపార లావాదేవీలను కొనసాగించకుండా అమెరికా తనను తాను కట్టడి చేసుకుంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, చైనాకు వ్యతిరేకంగా అమెరికా పనిచేయడం మొదలుపెట్టాయి.. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు గాని.. ఈ రెండు దేశాల మధ్య మాత్రం ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా కలకలం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కలకలం నెలకొంది. పెన్సిల్వినియా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉండగా.. ఓ దుండగుడు సమీప భవనం పై కప్పు ఎక్కి.. ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. తర్వాత 5 షాట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి పక్క నుంచి దూసుకుపోయింది. దీంతో అతడికి తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం కావడంతో ట్రంప్ ను భద్రతా దళ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించింది. ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ స్పందించారు. కాల్పుల ఘటనను తప్పుపట్టారు. అమెరికాలో హింసకు తావు లేదని తేల్చి చెప్పారు.
కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే..
ట్రంప్ పై కాల్పులు జరిగిన అనంతరం కొద్ది గంటల్లోనే చైనాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. చైనాలో దుస్తులు విక్రయించే వ్యాపారులు ట్రంప్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్న ఫోటోలను ముద్రించిన సావనీర్ టీ – షర్టులను విక్రయించడం మొదలుపెట్టారు.. అవి క్షణాల్లోనే అమ్ముడుపోయాయి..” మేము ట్రంప్ హత్యాయత్నం గురించి వార్తలు చూడగానే వెంటనే టీ షర్టులు ముద్రించాం. మాకు గంటలో రెండువేల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మేము త్వరగా సావనీర్ టీ షర్టులను రూపొందించామని” చైనాలోని టావో బావో ప్రాంతంలో టీ షర్టులు విక్రయించే లీ జిన్ వీ పేర్కొన్నారు.
ఉన్నట్టుండి ఆర్డర్లు వచ్చాయి
చైనాలో డిజిటల్ టీ షర్టుల ప్రింటింగ్ టెక్నాలజీ కి పేరుపొందిన గ్వాంగ్ డాంగ్ ప్రాంతంలో వందలాదిగా ట్రంప్ హత్యాయత్నానికి సంబంధించిన సావనిర్  టీ షర్టులను ప్రింటింగ్ చేశారు. అయితే ఎంత సంఖ్యలో ప్రింటింగ్ చేశారనేది తెలియ రాలేదు. ఈ టీ – షర్టులను ప్రింట్ చేయడమే ఆలస్యం.. చాలామంది యువత వాటిని కొనుగోలు చేశారు..” మాకు ఉన్నట్టుండి ఆర్డర్ వచ్చింది. వెంటనే మా సిబ్బందితో ఆ టీ షర్టులను ప్రింటింగ్ చేశాం. ఆదివారం అయినప్పటికీ సిబ్బందిని ఎక్కువ గంటలు పని చేయించాం. ప్రింటింగ్ చేసిన కొద్దిసేపటికే వాటిని మార్కెట్ కు తరలించాం. హత్యాయత్నం ఘటన వెలుగులోకి రావడమే ఆలస్యం.. మాకు ఆర్డర్ వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తానికి అయితే మాకు చేతినిండా పని దొరికిందని” గ్వాంగ్ డాంగ్ ప్రాంతానికి చెందిన జిన్ ఫ్లయింగ్ డిజిటల్ ప్రింటింగ్ ప్రొడక్షన్ కంపెనీ తెలిపింది.
అప్పుడు ట్రంప్ ఓడిపోయారు
అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు చైనాపై ఆరోపణలు చేశారు..”నీచమైన దేశంగా” చైనాను ఆయన అభివర్ణించారు. చైనాతో ఎప్పటికైనా ప్రమాదమేనని ఆయన పలు వేదికల్లో పునరుద్ఘాటించారు.. అంతేకాదు ద్వైపాక్షిక వాణిజ్య విషయంలో చైనాతో ట్రంప్ ఎక్కువగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఆయన భారతదేశంతో స్నేహాన్ని కోరుకున్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్య విషయంలో ట్రంప్ భారతదేశానికి పలుమార్లు వివిధ వేదికలపై తమ సహకారం ఉంటుందని ప్రకటించారు. దానిని చేతుల్లో చేసి చూపించారు. 2020 ఎన్నికల సమయంలో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు.