https://oktelugu.com/

IND vs ZIM 5th T20 : చివరి మ్యాచ్ లోనూ మట్టి కరిచిన జింబాబ్వే..4-1 తేడాతో సిరీస్ టీమిండియా వశం

ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నామమాత్రమైన చివరి టి20 మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జింబాబ్వే జట్టును 42 పరుగుల భారీ తేడాతో ఓడించింది. విజయంతో సిరీస్ ను ముగించింది.. ఇప్పటికే సిరీస్ టీమిండియా సొంతమైంది. నామమాత్రమైన ఐదవ టి20 మ్యాచ్ లోనూ గిల్ సేన అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది

Written By: Bhaskar, Updated On : July 14, 2024 9:18 pm
Follow us on

IND vs ZIM 5th T20 :అదే జట్టు.. అదే వేదిక.. ఫలితం కూడా అదే.. కాకపోతే విజయంలో కాస్త తేడా.. మొత్తానికి టీమిండియా యువభారత్ సత్తా చాటింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. దానికి కొనసాగింపుగా జింబాంబ్వే పై 5 t20 ల మ్యాచ్ సీరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది..

42 పరుగుల తేడాతో..

ఆదివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నామమాత్రమైన చివరి టి20 మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జింబాబ్వే జట్టును 42 పరుగుల భారీ తేడాతో ఓడించింది. విజయంతో సిరీస్ ను ముగించింది.. ఇప్పటికే సిరీస్ టీమిండియా సొంతమైంది. నామమాత్రమైన ఐదవ టి20 మ్యాచ్ లోనూ గిల్ సేన అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి జట్టు ఎదుట 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని చేదించే క్రమంలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టుకు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ ఎదురైంది. తొలి ఓవర్ మూడవ బంతికే బ్యాటర్ వెస్లీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఈ దశలో తొలి డౌన్ లో వచ్చిన బ్రియాన్(10), మరో ఓపెనర్ మరుమని(27) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు.. అయితే మరుమని ని వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ధాటిగా ఆడబోయిన బ్రియాన్.. శివం దూబే పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఫలితంగా జింబాబ్వే ఓటమి పాలయింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. శివం దూబే రెండు వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

ప్రారంభంలో షాక్ లు తగినప్పటికీ..

ఈ మ్యాచ్ లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. మొదట్లో దారుణమైన పరిస్థితులను చవి చూసినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది.. సంజు శాంసన్(58: 45 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసి అలరించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12; ఐదు బంతుల్లో రెండు సిక్సర్లు) సికిందర్ రజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ (14: 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముజర బాణి బౌలింగ్ లో క్లైవ్ పట్టిన క్యాచ్ తో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరుకున్నాడు. గిల్(13: 14 బంతుల్లో రెండు ఫోర్లు) సంజు శాంసన్ తో టీమిండియా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ జోడిని రిచర్డ్ విడదీశాడు. . ఇలా కీలక వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు ఒడిదుడుకులకు గురైంది.

భారత ఇన్నింగ్స్ నిర్మించారు

ఈ దశలో వచ్చిన రియాన్ పరాగ్ (22) తో సంజు టీమిండియా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు.. జింబాబ్వే బౌలర్లను ధైర్యంగా ప్రతిఘటించాడు. అయితే వీరిద్దరూ కేవలం 30 పరుగుల వ్యవధిలోనే ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికి జట్టు స్కోరు 135 పరుగులు. అయితే చివర్లో శివం దూబే(26), రింకూ సింగ్ (11) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజర బాణి రెండు వికెట్లు పడగొట్టాడు. సికిందర్, రిచర్డ్, బ్రాండన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

వారితో భర్తీ చేస్తారా?

ఈ విజయం ద్వారా భారత యువ జట్టు తమ ప్రతిభను నిరూపించుకుంది. టి20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అయితే ఇందులో అందరూ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కెప్టెన్ గిల్ రెండో మ్యాచ్ లో తరబడినప్పటికీ.. తర్వాతి మ్యాచ్ లలో సత్తా చాటాడు. అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచాడు. ఇక రవి బిష్ణోయ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన ఆటగాళ్లను రోహిత్, విరాట్, జడేజా స్థానాలలో భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.