Saudi UAE Conflict: యెమెన్‌లో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. ఇది పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. గతంలో ఒక్కటిగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లుగా భిన్న మార్గాల్లో పయనిస్తున్నాయి. ఫలింతంగా యెమెన్ మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది
2014 నుంచి కొనసాగుతున్న యుద్ధం
2014లో హూతీ తిరుగుబాటుదారులు సనా నగరాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర భాగాలను ఆక్రమించారు. దక్షిణ, తూర్పు ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. దక్షిణ యెమెన్ స్వాతంత్య్ర కోసం పోరాడుతున్న ఎస్‌టీసీ డిసెంబర్‌లో హద్రమౌత్, అల్–మరాహ్ వంటి ఇంధన ప్రాంతాలను ఆక్రమించింది. ఇది దేశవ్యాప్త అలజడికి దారితీసింది.
ఎవరు ఎవరితో?
గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. మరోవైపు ఎస్‌టీసీకి యూఏఈ అండగా నిలబడింది. హూతీలకు వ్యతిరేకంగా ఏకమైన ఈ దేశాలు ఇప్పుడు విడిగా పోరాడుతున్నాయి. సౌదీ, యెమెన్ సమైక్యతను కోరుకుంటూ ఎస్‌టీసీ ఆక్రమణలను వ్యతిరేకిస్తోంది. తమ సరిహద్దుల సమీపంలోని ప్రాంతాల ఆక్రమణ భద్రతకు ముప్పు అని గత నెల 25న ఎస్‌టీసీని హెచ్చరించింది.
సౌదీ ఆయుధ సాయం..
యూఏఈ ఎస్‌టీసీకి ఆర్థిక, ఆయుధ సహాయం అందిస్తోందని సౌదీ ఆరోపిస్తోంది. గత నెల 28న ముకల్లా ఓడరేవులో యూఏఈ నుంచి వచ్చిన ఆయుధ నౌకపై వైమానిక దాడి చేసింది. యెమెన్ ప్రభుత్వం యూఏఈ సైనికులను 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. శుక్రవారం మళ్లీ హద్రమౌత్‌పై భారీ దాడులు జరిగాయి.
సౌదీ మద్దతుతో నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ ఎస్‌టీసీతో భీకర పోరాటం చేస్తోంది. ఎస్‌టీసీ దాడులను తిప్పికొడుతున్నట్టు ప్రకటిస్తోంది. మొత్తంగా, యెమెన్‌లో స్థిరత్వం కోల్పోయి అంతర్యుద్ధం మళ్లీ ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.