Arshin Kulakarni: చెత్త బంతులను శిక్షించాడు. దూసుకు వచ్చే బంతులను క్షమించాడు. ఆవేశానికి పోలేదు. అలాగని చేతులు కట్టుకొని ఉండలేదు. స్థిర చిత్తాన్ని ప్రదర్శించాడు. దృఢ సంకల్పాన్ని కొనసాగించాడు. ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని బౌలర్లను ప్రతాపం చూపించనివ్వలేదు. నిదానమే ప్రధానం అనే సామెతను అనుసరిస్తూనే.. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి.. అనే జీవిత సత్యాన్ని నిజం చేశాడు. తద్వారా క్రికెట్లో ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చు.. ఇలా కూడా పరుగులు సాధించవచ్చని నిరూపించాడు.
దేశవాళీ క్రికెట్ లో భాగంగా బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీ(Vijay hajare trophy) నిర్వహిస్తోంది. ఈ ట్రోఫీలో భాగంగా శనివారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గ్రూప్ సి విభాగంలో మహారాష్ట్ర, ముంబై తలపడుతున్నాయి.
మహారాష్ట్ర జట్టు(Mumbai vs Maharashtra) ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటివరకు 42వ ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. మహారాష్ట్ర జట్టు ఓపెనర్లు పృథ్వి షా(71), అర్షిన్ కులకర్ణి(Arshin Kulakarni) (114) సత్తా చూపించారు. వీరిద్దరి తొలి వికెట్ కు ఏకంగా 140 పరుగులు జోడించారు. 141 బంతులు ఎదుర్కొన్న వీరిద్దరూ.. ముంబై జట్టు బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.. పృద్వి తన సహజ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. జాతీయ జట్టులో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న అతడు.. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా అతడు అద్భుతమైన ప్రతిభ చూపించాడు. 75 బంతులు ఎదుర్కొన్న అతడు 71 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 బౌండరీలు ఉన్నాయి. కులకర్ణి 114 బంతుల్లో 114 పరుగులు చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 11 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. మహారాష్ట్ర జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (65* ఈ కథనం రాసే సమయం వరకు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ త్రిపాటి (8*) అతడికి తోడుగా ఉన్నాడు.
ముంబై జట్టులో తుషార్ దేశ్ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో కులకర్ని ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. అతడు ఏమాత్రం ఆవేశానికి వెళ్లలేదు. అలాగని నిదానంగా బ్యాటింగ్ చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. చెత్త బంతులను మొహమాటం లేకుండా బౌండరీల వైపు తరలించాడు అదే కాదు, జాతీయ జట్టులో ఒకవేళ అవకాశాలు కల్పిస్తే.. సత్తా చూపిస్తానని సెలెక్టర్లకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. అతడు అద్భుతంగా ఆడటం వల్ల ముంబై జట్టు బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. మరోవైపు మహారాష్ట్ర జట్టు ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది.