Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లేవ లేని స్థితికి చేర్చారు. కర్ణుడిచావు కి సవాలక్ష కారణాలు అన్నట్టు.. వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడానికి అనేక రకాల అంశాలు పనిచేశాయి. అందులో ప్రధానమైనది అమరావతి రాజధాని నిర్మాణం. దానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే అమరావతి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడారు. చివరకు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత కూడా అమరావతిని స్మశానంతో పోల్చారు. అయితే మూడు రాజధానులు అన్నారు కానీ వాటిని కూడా కార్యరూపం దాల్చేలా చేయలేదు. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో కనిపించాయి. ఇప్పటికీ కూడా ఇంకా అమరావతి పై చెడు ప్రచారాన్ని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిని పట్టుకొని వేలాడుతున్నారు. అది ముమ్మాటికీ ఆయనతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా ఉండడం వరమో.. శాపమో తెలియడం లేదు.
* సోషల్ మీడియాలో సెటైర్లు..
సాక్షి మీడియాను( Sakshi media) చూసి చాలామంది నవ్వుకుంటారు. అయితే తెలుగు మీడియా ఛానళ్లలో మీమ్స్ ఎక్కువగా నడిచేది సాక్షి మీడియాపైనే. గత ఎన్నికల్లో సర్వే ఫలితాలు, ఎన్నికల ఫలితాల విషయంలో ఆ మీడియాలో జర్నలిస్టులతో పాటు విశ్లేషకులు చేసిన అతి అంతా ఇంతా కాదు. చివరకు వైసీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాబోతుందని… జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం విశాఖ వేదికగా చేస్తారని.. పలానా తేదీ అని ఒకరు.. కాదు కాదు ఇంకో తేదీ అని ఇంకొకరు.. ఒకరిద్దరూ పురోహితులతో మాట్లాడానని ఇంకొకరు.. ఇలా రక్తి కట్టిస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాకు చాలా రకాలుగా వినోదం పంచారు. ఇప్పటికీ ఆ సోషల్ మీడియాలో వీడియోలను చూసి చాలామంది నవ్వుకుంటూ ఉంటారు.
* ఆల్ ఈజ్ వెల్ అని చెబుతూ..
అయితే జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేది సాక్షి మీడియా అని తెలుస్తోంది. మళ్లీ అమరావతిపై విషప్రచారం మొదలుపెట్టింది సాక్షి. ప్రస్తుతం అమరావతిలో 50వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. 15వేల మందికి పైగా ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. వందలాది భారీ యంత్రాలతో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడిన చిన్నపాటి వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి సాక్షి కథనాలుగా ప్రచురిస్తోంది. అసలు అమరావతిలో పనులు జరగనట్టు.. ఇంకా ముల్లకంచలే ఉన్నట్లు చెబుతోంది సాక్షి. కానీ అక్కడ జరుగుతున్న పనులను చూపించే సాహసం చేయడం లేదు. అయితే అక్కడ జరుగుతున్న పనులు, నిర్మాణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అక్కడ పనుల్లో ఏమైనా అవినీతి జరిగితే దానిని చూపించాలి. లోపాలు ఉంటే వెలుగులోకి తేవాలి.. కానీ అక్కడ అసలు పనులే జరగవు అన్నట్టు.. యధాతధంగా అమరావతి అలానే ఉందని చూపే ప్రయత్నం చేస్తోంది సాక్షి. కానీ ఆ పరిస్థితుల్లో ఉంచింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని మరిచిపోతోంది. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చీమ కదలదు. సాక్షి మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళితే మాత్రం ఆయనకు మరోసారి భంగపాటు తప్పదు