Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపటి పది నెలలు కావస్తోంది. ట్రంప్ 2.0 పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. అమెరికా ఫస్ట్.. గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదాలతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వాటిని సాకారం చేసేందుకు తన పరిధి మించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇటు అమెరికన్లు.. అటు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. దేశ రాజకీయ దిశను ఒక్కసారిగా మార్చుతున్నాయి. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల వరద, పరిపాలనా సంస్కరణల పేరిట జరుగుతున్న భారీ ఉద్యోగాల తొలగింపులు, వలస విధానాల్లో కఠిన మార్పులు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్‘ పేరుతో జరిగిన భారీ నిరసనలు, అమెరికా ప్రజాస్వామ్యంలో ప్రజల అసహనానికి ప్రతిబింబంగా నిలిచాయి. 50 రాష్ట్రాల్లో సుమారు 2,500 ప్రదేశాల్లో జరిగిన ఈ ఆందోళనల్లో విస్తార ప్రజాభాగస్వామ్యం కనిపించింది.
సంస్కరణల పేరుతో సంక్షోభంలోకి..
ట్రంప్ నిర్వహిస్తున్న పరిపాలన పునర్‌వ్యవస్థీకరణలో సామాజిక, లైంగిక, వలస అంశాలు ప్రధానాస్థానంలో నిలిచాయి. ట్రాన్స్ జెండర్ రక్షణల సడలింపులు, పౌరసత్వ నియమాల కొత్త ముసాయిదాలు, వలసదారుల సోదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘డోజ్‘ కమిటీ చర్యల ఫలితంగానే వేలాది ప్రభుత్వ ఉద్యోగులు తొలగించబడ్డారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాలు సామాజిక ఆందోళనలకు కారణమవగా, నిరసనకారులను అడ్డుకునేందుకు జాతీయ బలగాలను రాష్ట్రాల్లో మోహరించడం విమర్శలకు దారితీసింది. ఇది ట్రంప్ నియంత్రణశైలిని ‘నిరంకుశ పాలన‘గా పేర్కొనడానికి నిరసనకారులకు మరింత బలం ఇచ్చింది.
దేశవ్యాప్త ఉద్యమంగా..
జూన్ నెలలో వాషింగ్టన్‌లో జరిగిన సైనిక పరేడ్ నేపథ్యంతో ట్రంప్ విధానాలకు వ్యతిరేక నిరసనలు మరింత పెరిగాయి. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ‘ప్రజాస్వామ్యంలో రాజులు లేరు‘ అనే నినాదంతో గళమెత్తారు. సెనెట్ నేత చక్ షూమర్, కాంగ్రెస్ సభ్యుడు బెర్నీ సాండెర్స్‌లతోపాటు పలువురు రాజకీయనాయకులు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమం కేవలం పార్టీ పరిమితికి మించి, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంగా మారింది.
కొనసాగుతున్న షట్‌డౌన్..
ఇదిలా ఉంటే మూడు వారాలుగా ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతోంది. అనేక శాఖలు మూతపడడం, లక్షలమంది ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడటం దేశవ్యాప్తంగా అసహనాన్ని పెంచింది. పరిపాలన స్థబ్దతను ప్రజలు ట్రంప్ విధానాల నేరుగా ఫలితమని భావిస్తున్నారు. ఇదే అసంతృప్తి ‘నో కింగ్స్‘ నిరసనలను మరింత వ్యాప్తి చేయడానికి దోహదమైంది.
స్పందించిన ట్రంప్…
వైట్ హౌస్ ఎన్నడూ లేని విధంగా రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తోంది. రిపబ్లికన్ మద్దతుదారులు నిరసనకారులను ‘అమెరికా వ్యతిరేక వర్గాలు‘గా అభివర్ణిస్తుండగా, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నేను రాజును కాదు, ఎన్నికైన నాయకుణ్ని మాత్రమే‘ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్య నిరసనలను ఆపలేకపోయింది. పలురాష్ట్ర గవర్నర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ జాతీయ బలగాలను సిద్ధంగా ఉంచారు. నిరసనకారుల పంచిన ఆన్‌లైన్ పత్రికలలో, అమెరికా రాజ్యాంగ విలువలను కాపాడటం తమ ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమెరికా ‘ప్రజాస్వామ్యం వర్సెస్ వ్యక్తి ఆధిపత్యం‘ అనే చర్చలో చిక్కుకుపోయినదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ సంస్కరణలు ఎక్కువగా వ్యక్తిస్వేచ్ఛల ఖాతాలో భారం పెడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘నో కింగ్స్‘ ఉద్యమం తాత్కాలిక నిరసనకాక, ప్రజా స్వరాన్ని మళ్లీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది.