Donald Trump : ట్రంప్‌పై కాల్పులు.. అగ్రరాజ్యంలో రాజుకున్న నిప్పు.. బైడెన్‌ కీలక ప్రసంగం

ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన పెనిసల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలోనే ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్‌ తగిలింది. ప్రాణాలు ఫణంగా పెట్టి తన భర్తను ఈరోజు రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Written By: NARESH, Updated On : July 15, 2024 12:43 pm

Political heat in America with the shooting of Donald Trump

Follow us on

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆదివారం(జూలై 14న) జరిగిన కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యురో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టొఫర్‌ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల వేళ సంచలనం..
ఇక అమెరికాలో ఈ ఏడాది చివరన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లిక్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన పెనిసల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలోనే ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్‌ తగిలింది.

అధ్యక్షుడి కీలక ప్రకటన..
ఇక అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిగిన ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోని ఓవెల్‌ ఛాంబర్‌ నుంచి ఆయన ప్రసంగించారు. ఈ ఘటనపై ఎవరికి తోచినట్లు వారు ఊహించుకోవద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. రాజకీయాలను రణక్షేత్రంగా మార్చాలనుకోవడం సరికాదని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో రిపబ్లికన్లు ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవచ్చని తెలిపారు. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తారనడంలో సందేహాలు అక్కర్లేదని పేర్కొన్నారు. తన ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న కాల్పుల ఘటనలన్నింటినీ గుర్తు చేస్తారని, ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గన్‌ కల్చర్‌కు ఎలా అడ్డుకట్ట వేస్తారో ప్రచారం చేసుకుంటారని వెల్లడించారు.

త్వరలో దేశవ్యాప్త పర్యటన..
ఇదిలా ఉంటే.. త్వరలో తాను దేశవ్యాప్త పర్యటన చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. రాజకీయపరమైన విమర్శలను ఎదుర్కొనడానికి, వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, హింసకు ఆస్కారం లేని సమాజాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

బ్యాలెట్‌తోనే ప్రజాస్వామ్యం..
ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్‌ ముఖ్యమన్నారు. బుల్లెట్లతో ప్రజాస్వామ్యం కాపాడలేమని పేర్కొన్నారు. అమెరికాను ఎవరు పాలించాలనే విషయాన్ని ప్రజలు బ్యాలెట్‌ బాక్సుల ద్వారా నిర్ధారిస్తారని తెలిపారు. బుల్లెట్లతో దాడులు చేసే హంతకులు కాదని తేల్చి చెప్పారు.

దేశం ఏకతాటిపై ఉండాలి..
ఇలాంటి సమసయంలో యావత్‌ దేశం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని బైడెన్‌ పిలుపునిచ్చారు. ఈ ఘటనపై వేగంగా, సమగ్ర దర్యాప్తు జరుపుతామని తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగుడి లక్ష్యం, అతడి గుర్తింపునకు సంబంధించి తొందరపడి ఎలాంటి అంచనాలకు రావొద్దని కోరారు.

ఓవల్‌ ఆఫీస్‌ నుంచే ప్రసంగం ఎందుకు..
ఇదిలా ఉంటే.. బైడెన్‌ వైట్‌హౌస్‌లో తాను ప్రసంగించాల్సిన వేదికను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్న ప్రసంగాలకు మాత్రమే ఓవల్‌ ఆఫీస్‌ను వేదికగా చేసుకుంటారు. తాజాగా ట్రంప్‌పై కాల్పులు, అంతర్గత ఉగ్రవాదంగా పరిగణిస్తూ ఎఫ్‌బీఐ దర్యాప్తు వంటి పరిణామాలతో బైడెన్‌ ఓవల్‌ ఆఫీస్‌నుంచి ప్రసంగించారు.

స్పందించిన ట్రంప్‌ భార్య..
ట్రంప్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన భార్య మెలనీయా ట్రంప్‌ స్పందించారు. తన భర్తపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆమె ఈ మేకు స్పందించారు. పరస్పర గౌరవం పరమావధిగా ఉండే ప్రపంచాన్ని మనమంతా కోరుకుంటున్నాం అన్నారు. కుటుంబానికి ప్రాధాన్యమిస్తూ ప్రేమ ఫరిఢవిల్లేలా ప్రపంచం ఉండాలని సూచించారు. ఈ ప్రపంచాన్ని మనం మళ్లీ సాకారం చేసుకోవాలన్నారు. మన బంధాలకు పునాది రాయిలా గౌరవం నిలిచేలా చూడాలని విన్నవించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తన భర్తను ఈరోజు రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు.