PM Modi US Visit : మోదీ అమెరికా పర్యటన వేళ.. షేక్ అవుతోన్న సోషల్ మీడియా

భారతదేశానికి రక్షణ పరంగా పలు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇదంతా జరుగుతుండగానే దేశంలోని ప్రతిపక్షాలు ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా ఐక్యవేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 24, 2023 9:25 am
Follow us on

PM Modi US Visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ద్వై పాక్షిక వాణిజ్యంపై అమెరికా దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. డిఫెన్స్ నుంచి అంతరిక్షంలో ప్రయోగాల వరకు పలు కీలక అంశాలపై సంతకాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అమెరికాలో మోడీకి లభిస్తున్న స్వాగతం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఒకప్పుడు తమ దేశానికి రావద్దు అంటూ వీసా ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా.. నేడు తమ దేశానికి రండి అంటూ ప్రత్యేకంగా ఆహ్వానించిన తీరు పట్ల మోడీ తనదైన శైలి లో స్పందించారు. ఒకప్పుడు వైట్ హౌస్ తలుపులు తనకోసం తెరుచుకోలేదని, ఈరోజు తన రాక కోసం ఎదురుచూశాయని మోడీ ఉద్వేగంగా అన్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి. సరే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటన సందర్భంగా రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు రకాల వీడియోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రధాని అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ పలు కీలక అంశాలపై సంతకాలు చేస్తున్నారు. భారతదేశానికి రక్షణ పరంగా పలు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇదంతా జరుగుతుండగానే దేశంలోని ప్రతిపక్షాలు ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా ఐక్యవేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు భేటీ అయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కూటమి ఎలా నడపాలి, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి? అనే అంశాల మీద విస్తృతంగా చర్చలు జరిపారు. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చిన సందర్భాలు తక్కువ. ఇవి ఒకటి రెండు సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఈసారి అలా జరగకుండా ఉండాలని నితీష్ కుమార్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటి అమలు ఎలా ఉంటుందని కాలమే నిర్ణయిస్తుంది.

ఇక ప్రతిపక్షాల భేటీ నేపథ్యంలో మోడీ అనుకూల నెటిజన్లు రెచ్చిపోతున్నారు. తమ సృజనతో ఆసక్తికరమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే ఇలాంటి జాబితాలో ఒక వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. దట్టమైన అడవి నుంచి గంభీరంగా పులి అడుగులు వేసుకుంటూ వస్తుంది. దాని వెనుక పదులకొద్దీ వాహనాలు ఉంటాయి. అందులో పర్యాటకులు ఉంటారు. వారు ఆ పులి అడుగులు వేస్తుంటే ఫోటోలు తీస్తూ ఉంటారు. దాని అడుగులు లయబద్ధంగా వేస్తూ ఉంటే ఒక్కొక్క భంగిమను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో పులికి మోదీగా నామకరణం చేసిన నెటిజన్.. ఆ పులిని అనుసరిస్తున్న పర్యాటకులను ప్రతిపక్ష పార్టీలుగా పేర్కొన్నారు. అంటే గంభీరంగా నడుచుకుంటూ వెళుతున్న ప్రధానమంత్రి మోడీకి ఎదురు వెళ్లే సాహసం ప్రతిపక్షాలు చేయలేవని నెటిజన్ ఉద్దేశం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 29,000 లైక్స్ సొంతం చేసుకుంది.