Zartaj Gul video viral: మీ కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నా.. పట్టించుకోరా? మహిళా ప్రజా ప్రతినిధి ప్రశ్నకు బిత్తర పోయిన స్పీకర్..

Zartaj Gul video viral: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో జాతీయ అసెంబ్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 1, 2024 6:31 pm

Pakistan woman leader Zartaj Gul video viral

Follow us on

Zartaj Gul video viral: మనం మాట్లాడుతున్నప్పుడు.. ఎదుటి వ్యక్తి మనల్ని చూడకుండా.. ఎటువైపో చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన కలుగుతుంది. అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలు గాడి తప్పుతాయి. అసలు విషయం పక్కకు వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆ మాజీ మంత్రికి ఎదురైంది. దీంతో ఆమె స్పీకర్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో జాతీయ అసెంబ్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. అక్కడ రోజు మొత్తం సమావేశాలు నిర్వహిస్తే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మధ్యాహ్నం వరకే మమ అనిపిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జర్తాజ్ గుల్ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ సాధిక్ కన్నెత్తి కూడా చూడలేదు. ఇది జర్తాజ్ కు ఆగ్రహం తెప్పించింది. ” నేను ప్రజల తరఫునుంచి ఈ సభకు వచ్చిన రాజకీయ నాయకురాలిని. 1,50,000 మంది ప్రజలు ఓట్లు వేసి నన్ను ఇక్కడికి పంపించారు. నా పార్టీ స్పష్టతను నేర్పింది. సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటం అలవాటు చేసింది. నేను ఇంతలా మాట్లాడుతున్నప్పటికీ మీరు నా వైపు అసలు చూడటం లేదు. నా వైపు మీరు చూడనప్పుడు నేను మాట్లాడలేను. అందువల్ల మీరు మీ కళ్ళజోడు పెట్టుకొని నా వైపు ఒకసారి చూడండి. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుందని” గుల్ స్పీకర్ ను కోరింది.. దీనికి స్పీకర్ కూడా ఆయనదైన శైలిలో స్పందించాడు.

” నేను మీ మాటలు వినడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు? కాకపోతే నాకు మహిళల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మర్యాద అనిపించదు. అందువల్ల మిమ్మల్ని నేను సూటిగా చూడటం లేదని” స్పీకర్ బదులు ఇవ్వడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.. దీనికి గుల్ కూడా నవ్వారు. ” మీరు అలా అనుకుంటే ఎలా? సూటిగా చూడలేననే సాకుతో సభలో 52 శాతం మంది మహిళలను తొలగిస్తారా? అలా అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ సభలో ఉంటారు. మీరు ఎంపిక చేసిన సభ్యులు మాత్రమే మాట్లాడతారు. అలాంటి పరిణామం ఈ సభకు మంచిదేనా? మహిళలు మాట్లాడుతూ ఉంటే చూడాలి.. వినాలి. అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని” గుల్ వ్యాఖ్యానించింది.. అయితే ఈ వీడియోను పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. తమ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. ఫలితంగా గుల్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.