PoK Protests: మామూలు హింస కాదు అది.. ఇంటర్నెట్ లేదు. సోషల్ మీడియా లేదు. బయటికి ప్రపంచంతో సంబంధం లేదు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతంలో దిగింది. ప్రజలను బయటికి రాకుండా అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆగడం లేదు. బయటికి వస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. తుపాకీ బుల్లెట్లు శరీరాన్ని దూసుకొని వెళ్తున్నప్పటికీ లెక్కచడం లేదు. పైగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది.. ఎందువల్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఈ స్థాయిలో వ్యక్తమవుతోంది..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాదాపు 45 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 12 సీట్లను పాకిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఈ స్థానాలను పాకిస్థాన్లో స్థిరపడ్డ కాశ్మీరీ శరణార్థులకు కేటాయించాలని 1947 లోనే తీర్మానం చేశారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ దీనికి చరమగీతం పాడింది. ఈ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి రావలపిండి, ఇస్లామాబాద్, కరాచీ ఇతర నగరాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే అక్కడవారిని పాకిస్తాన్ రాజకీయ పార్టీలు ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి.
దీనివల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఆధిపత్యం పెరిగిపోయింది. 12 స్థానాలలో తనకు నచ్చిన వారిని నియమించుకోవడం మొదలుపెట్టింది. ప్రజాస్వామ్యం అనే విధానానికి చరమగీతం పాడింది. ఫలితంగా ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది చనిపోయారు. అయినప్పటికీ భారతదేశంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి విలువైన వనరులు ఇతర ప్రాంతాలకు తరలించకూడదని స్పష్టం చేస్తున్నారు. మా ప్రాంతం.. మా వనరులు.. మాకు మాత్రమే సొంతం అన్నట్టుగా ఇక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారి మీద ఉక్కు పాదం మోపుతోంది… మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జాయింట్ అవామి యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతోంది.
ఈ ఆందోళనలు తీవ్రహింసాత్మకంగా మారిపోయాయి. పాకిస్తాన్ ఆర్మీ, ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పిల్లలు, గర్భిణీలు కూడా ఉన్నారు. వారిపై పాకిస్థాన్ ఆర్మీ దారుణంగా కాల్పులు జరుపుతోంది. ఫైరింగ్ లో 19 చిన్నారులు.. ఏడుగురు గర్భిణులు చనిపోయారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ మారణకాండ పై విచారణకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ డిమాండ్ చేసింది.

