Pakistan Internal Crisis: పాకిస్తాన్ దేశంలో వరుసగా అంతర్గత సంక్షోభాలు చోటు చేసుకుంటున్నాయి. మనతో పాటుగానే స్వాతంత్రం పొందినప్పటికీ పాకిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి సాధించలేదు. ఆర్థికంగా.. సామాజికంగా.. రక్షణ పరంగా.. ఏ అంశంలో చూసుకున్నా సరే పాకిస్తాన్ అభివృద్ధి కాదు కదా.. ఇండియాతో పోల్చి చూస్తే కనీసం కరివేపాకు స్థాయిలో కూడా వృద్ధి సాధించలేదు. ఇండియా ఏకంగా ప్రపంచ శక్తిగా ఎదిగితే.. పాకిస్తాన్ ఉగ్రవాదంలో ఆ స్థాయిని చేరుకుంది.
పాకిస్తాన్ దేశంలో గతంలో అక్కడ ఏం జరిగినా సరే బయటికి తెలిసేది కాదు. అక్కడి పాలకులు నిరంకుశంగా వ్యవహరించేవారు. ప్రజలకు చుక్కలు చూపించేవారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో.. ఇతర చుట్టుపక్కల ప్రాంతాలలో పాకిస్థాన్ పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టేవారు. ఒక రకంగా ప్రజలను పశువుల లాగా చూసేవారు. విలువైన వనరులను దోచుకుని పోయేవారు. ప్రశ్నించిన ప్రజల మీద ఆర్మీని ప్రయోగించేవారు. కాల్పులకు తెగబడేవారు.
ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్.. బలూచ్.. కైబర్ వంటి ప్రాంతాల ప్రజలలో చైతన్యం పెరిగింది. అంతేకాదు పాకిస్తాన్ పెత్తనాన్ని అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మాంగీ డ్యామ్ వద్ద నిరసనకారులు పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దాడులు కూడా చేశారు. ఈ దాడుల్లో చాలామంది పోలీస్ సిబ్బంది చనిపోయినట్టు తెలుస్తోంది. మాంగి డ్యాం వద్ద గంటల తరబడి పోరాటం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ సైన్యం అక్కడి పోలీసులకు కనీసం సహకారం కూడా అందించలేదు. వైమానిక రక్షణ కూడా కల్పించలేదు. ప్రజల్లో నెలకొన్న తీవ్రస్థాయి ఆగ్రహాన్ని పాకిస్థాన్ ఆర్మీ ముందుగానే అంచనా వేసింది. అక్కడికి వెళ్తే తమ ప్రాణాలు కూడా పోతాయని భావించి బయపడింది. ఫలితంగా పాకిస్తాన్ పోలీసులకు రక్షణ ఇవ్వకుండా వినోదం చూసింది.
కైబర్.. బలూచ్.. ఇతర ప్రాంతాలలో కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. తమ ప్రాంతాలలో పాకిస్థాన్ పెత్తనం ఉండకూడదని.. తమకు స్వాతంత్రాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీ మీద తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఒక దశలో ప్రాణాలు పోయినా సరే.. పాకిస్తాన్ దేశానికి తమ ప్రాంతాల మీద పెత్తనం అప్పగించే సవాలే లేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అందువల్లే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతాల మీద అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి అంతర్గత సంక్షోభాలను కనీసం పరిష్కరించుకోలేని పాకిస్తాన్ పరిపాలకులు.. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషించడం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.. ముందు పాకిస్తాన్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని.. అప్పుడు మిగతా ప్రపంచం గురించి ఆలోచించాలని వారు సూచిస్తున్నారు.
