Pakistan in support of Iran: పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్–ఇరాన్ పరస్పర దాడులతో బాంబుల మోతలు మోగుతున్నాయి. ఇరాన్ వద్ద అన్వాయుధాలు ఉండకూడదన్న లక్ష్యంతో అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. అయినా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలో ఇరాన్ ఐఆర్‌డీసీ జనరల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇరాన్‌కు చెందిన ఐఆర్‌డీసీ జనరల్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు మొహసిన్ రెజాయి, ఇజ్రాయెల్ ఇరాన్‌పై అణు దాడి చేస్తే, పాకిస్థాన్ దానికి ప్రతిస్పందనగా టెల్ అవీవ్‌పై అణుబాంబు ప్రయోగిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాకిస్థాన్ నుంచి ఈ విషయంలో హామీ లభించింది‘ అని ఆయన స్పష్టం చేశారు.
ఇస్లామిక్ సైనిక కూటమి ప్రతిపాదన
మొహసిన్ రెజాయి, తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లతో కలిసి ఇస్లామిక్ సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే, ఈ దేశాలు ఇరాన్ నాయకత్వంలో ఏకీకృత సైనిక శక్తిగా మారడానికి సిద్ధంగా లేవని ఆయన అన్నారు. ‘ఈ దేశాల్లో ఒక్కటైనా ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, ప్రాంతీయ శక్తి సమతుల్యత రాత్రికి రాత్రే మారిపోతుంది‘ అని ఆయన హెచ్చరించారు.
అణ్వాయుధ దేశాల సందర్భం
ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్, పాకిస్థాన్‌తోపాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ సందర్భంలో ఇరాన్–పాకిస్థాన్ మధ్య ఒప్పందం ఉందన్న మొహసిన్ వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
Also Read: Trump shocked China: చైనాకు షాక్ ఇచ్చిన ట్రంప్.. భద్రతా వ్యూహమా.. రాజకీయ ఒత్తిడా..?
ఉద్రిక్తతల నేపథ్యం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఈ ఘర్షణకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మద్దతు హామీ ఇరాన్‌కు ఊతమిస్తుందని, అదే సమయంలో ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొహసిన్ రెజాయి వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్–పాకిస్థాన్ మధ్య సైనిక సహకారం, ఇస్లామిక్ కూటమి ప్రతిపాదనలు మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.