Pakistan Election Results 2024: భుట్టో+నవాజ్.. సంకీర్ణ సర్కార్ కు పాక్ జనం ఓటు

పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. ఆయన ప్రసంగించినట్టు ఓ వీడియో రూపొందించి పాకిస్థాన్ ప్రజలకు అందుబాటులో ఉంచింది.

Written By: Suresh, Updated On : February 10, 2024 3:58 pm
Follow us on

Pakistan Election Results 2024: సంక్షోభం అంచున పాకిస్తాన్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి జరుపుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. రెండు రోజులుగా ఓట్లు లెక్కిస్తున్నప్పటికీ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్తాన్ ముస్లిం లీగ్ ( నవాజ్) పార్టీలు వేటికవే విజయాన్ని ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు తాము విజయాలు సాధించామని చెప్పుకుంటున్నారు.. సంబరాలు కూడా చేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి పని చేయాలని ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు లాహోర్ లో శుక్రవారం రాత్రి ఒక హోటల్లో సమావేశమయ్యారు.. అనేక చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు పై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారని పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. అయితే చర్చలు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదని.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రెండు పార్టీల నాయకులు ఇంకా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇది జరుగుతుండగానే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం విజయవంతంగా తమ విధిని నిర్వహించిందని ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం విశేషం. “25 కోట్ల పాకిస్తాన్ జనాభా కు నిస్వార్ధంగా సేవలు అందించేందుకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. దేశ ప్రయోజనాల కోసం కంకణ బద్ధులమై ఉన్నాం. అరాచక పాలనకు చరమగీతం పాడుతూ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాడాలని” ఆయన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని, ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలుపుదల చేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్రం, రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా మిత్రపక్షలతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. కడపటి వార్తలు అందే వరకు ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది.. పీఎంఎల్_ ఎన్ 71, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53, ఇతర చిన్న పార్టీలు 27 స్థానాలలో విజయం సాధించాయి. ఇంకా 15 సీట్లలో ఫలితాలు వెల్లడి కావలసి ఉంది. దేశంలో ఓటింగ్ ముగిసి 40 గంటలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీనిపై పాకిస్తాన్ మీడియా మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్లో రిగ్గింగ్ జరిగింది, ఫలితాలను మార్చే కుట్ర జరుగుతోంది అనే అనుమానాలను అవి వ్యక్తం చేస్తున్నాయి.

పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. ఆయన ప్రసంగించినట్టు ఓ వీడియో రూపొందించి పాకిస్థాన్ ప్రజలకు అందుబాటులో ఉంచింది. ” 25 కోట్ల పాకిస్తాన్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు నవాజ్ షరీఫ్ నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. దేశం అత్యంత విచ్ఛిన్నకర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మీరు మీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ ఫలితాన్ని 40 గంటలు గడిచిన కూడా వెల్లడించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతున్నది. నవాజ్ షరీఫ్ పార్టీ 30 సీట్లు వెనుకబడినప్పటికీ విక్టరీ ప్రసంగం చేస్తున్నారు.. దీనిని బట్టి అక్కడ ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి” అని ఇమ్రాన్ ఖాన్ తన ఏఐ ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది.