spot_img
Homeఅంతర్జాతీయంPakistan Occupied Kashmir Autonomy Reality: పాక్‌ చీటింగ్‌ గేమ్‌.. పీవోకే స్వతంత్రం వెనుక చీకటి!

Pakistan Occupied Kashmir Autonomy Reality: పాక్‌ చీటింగ్‌ గేమ్‌.. పీవోకే స్వతంత్రం వెనుక చీకటి!

Pakistan Occupied Kashmir Autonomy Reality: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) గురించి చాలామందికి ఒక ప్రశ్న తరచూ వస్తుంది. అక్కడ ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం ఎందుకు ఉన్నాయి? ఇవి నిజంగా స్వయం ప్రతిపత్తిని సూచిస్తాయా? లేదా ఇవి కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమేనా? ఈ ప్రశ్నలు ఇటీవలి ఆందోళనల నేపథ్యంలో మరింత స్పష్టంగా ఎదురవుతున్నాయి.

అధికారికంగానే పేరు..
పాకిస్థాన్‌ ఈ ప్రాంతాన్ని ‘‘ఆజాద్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌’’ అని అధికారికంగా సంబోధిస్తుంది. ఇక్కడ అధ్యక్షుడు రాజ్యాంగపరమైన అధిపతిగా, ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారని చెబుతారు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిమండలి, ప్రత్యేక జెండా వంటి నిర్మాణాలు ఉన్నాయి. బయటి నుంచి చూస్తే ఇది స్వతంత్రంగా లేదా స్వయం నిర్ణయాధికారంతో నడిచే ప్రాంతంలా కనిపిస్తుంది.

భారత్‌లో విలీనం..
1947లో భారత విభజన తర్వాత జమ్మూ కశ్మీర్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో జరిగిన మొదటి యుద్ధం ముగిసే సమయానికి కొంత భూభాగం పాకిస్తాన్‌ నియంత్రణలో మిగిలింది. పాకిస్తాన్‌ ఆ ప్రాంతాన్ని తన సాధారణ ప్రావిన్సుల్లో కలపలేదు. మొత్తం కశ్మీర్‌పై తన హక్కును అంతర్జాతీయంగా కొనసాగించాలని అనుకుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపించే విధానాన్ని అనుసరించింది.

కరాచీ ఒప్పందం…
1949లో కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగ విధానం, సమాచార వ్యవస్థలు వంటి కీలక అధికారాలను పాకిస్తాన్‌ తన వద్దే ఉంచుకుంది. 1974లో తాత్కాలిక రాజ్యాంగం అమల్లోకి తెచ్చి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. అయితే ఈ రాజ్యాంగం ప్రకారం కూడా ప్రధాన నిర్ణయాలు ఇస్లామాబాద్‌ అనుమతితోనే తీసుకోవాలి. వాస్తవ పరిపాలన, నియంత్రణ స్వరూపంరక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక విషయాలు అన్నీ పాకిస్థాన్‌ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పీవోకే పరిపాలనలో పాకిస్తాన్‌ నుంచి పంపిన అధికారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. శాసనసభలో కొన్ని స్థానాలు పాకిస్తాన్‌లో ఉన్న కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయి. ఇది స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది.

విధేయతే ప్రమాణం..
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే వాదనకు మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. దీంతో భిన్న అభిప్రాయాలు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

భారత్‌ స్థిరమైన వైఖరి..
భారత్‌ ఈ మొత్తం ప్రాంతం తన అంతర్భాగమని, 1947 నుంచి పాకిస్తాన్‌ అక్రమ ఆక్రమణలో ఉందని స్పష్టంగా పేర్కొంటుంది. స్థానిక సంస్థలు ఉన్నప్పటికీ అవి నిజమైన స్వతంత్రతను సూచించవని, అవి పాకిస్తాన్‌ నియంత్రణలోనే పనిచేస్తున్నాయని భారత్‌ అభిప్రాయం. ఈ వ్యవస్థలు ప్రపంచానికి స్వయం ప్రతిపత్తి చూపించడానికి సృష్టించినవని భారత్‌ వాదిస్తుంది.

బయటికి కనిపించే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ వంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ, రక్షణ, విదేశాంగం, కీలక నిర్ణయాలు అన్నీ ఇస్లామాబాద్‌లోనే తీసుకోబడుతున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం పాకిస్తాన్‌ రిమోట్‌ కంట్రోల్‌లోనే నడుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular