https://oktelugu.com/

North Korea-South Korea : బాంబులు, బెలూన్లు, చెత్త అయిపోయింది..ఇప్పుడు లౌడ్ స్పీకర్లు.. దక్షిణ కొరియా పాలిటి విలన్ గా ఉత్తరకొరియా కిమ్..

అదేదో సినిమాలో కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా అని హీరో అంటాడు గుర్తుందా.. ఆ డైలాగు ను వర్తమానానికి ఆపాదిస్తే కిమ్ కు గుర్తుకొస్తాడు. బాంబులను ప్రయోగించాడు. బెలూన్లను ఉపయోగించాడు. చెత్తను కూడా వాడుకున్నాడు. ఇప్పుడు శత్రువును ముట్టించడానికి శబ్దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 17, 2024 / 09:05 PM IST

    North Korea-South Korea

    Follow us on

    North Korea-South Korea : ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బూడిదలా మారుతుంది. దక్షిణకొరియా కొన్ని విషయాలలో శాంతంగా ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా అలా కాదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్(Kim Jong un) వ్యవహార శైలి అలా ఉండదు. గిచ్చి కయ్యం పెట్టుకునే రకం అతడు. ఇక ఇటీవల చెత్త బెలూన్లను దక్షిణ కొరియా మీదికి ప్రయోగించాడు. దక్షిణ కొరియాలో గృహాలు, విమానాశ్రయాలు, రోడ్లపై ఆ చెత్తను పడేశాడు. రాకపోకలకు ఏమాత్రం వీలు లేకుండా చేశాడు. ఇక ప్రస్తుతం దక్షిణ కొరియా సరిహద్దుల్లో మరో విచిత్రమైన పన్నాగానికి శ్రీకారం చుట్టాడు. దక్షిణ కొరియా బోర్డర్లో మెటాలిక్ గ్రైండింగ్ చేస్తూ.. ఆ శబ్దాలు దక్షిణ కొరియా ప్రజలకు వినపడే విధంగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. కిమ్ చేస్తున్న దారుణాలు చూడలేక దక్షిణ కొరియా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అక్కడి అధికారులు వీడెవడ్రా బాబూ అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు.

    భరించలేని శబ్దం

    దక్షిణ కొరియాలో మిలిటరైజడ్ జోన్ పరిధిలోని డాంగ్సన్ పేరుతో ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామానికి సరిహద్దుల్లో ఉత్తరకొరియా భయంకరమైన శబ్దం వచ్చే బాంబులను పేల్చడం మొదలుపెట్టింది. మెటాలిక్ గ్రెండింగ్, ఫిరంగి కాల్పులను చేపడుతోంది. ఈ శబ్దాలను లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి 24 గంటలపాటు దక్షిణ కొరియా ప్రజలకు వినిపిస్తోంది. ఈ శబ్దాల తీవ్రతకు చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు నరకం చూస్తున్నారు. నిద్ర లేమిని ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన తలనొప్పితో చుక్కలు చూస్తున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అమెరికాతో ఇటీవల దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు పాల్పడింది. దానిని నిరసిస్తూ కిమ్ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడుతున్నారని గ్లోబల్ మీడియాలో వార్త వస్తుంది. ఆ శబ్దాలను నిరోధించడానికి డాంగ్సన్ ప్రజలు తలుపులు, కిటికీలను స్టైరో ఫోమ్ తో మూసేస్తున్నారు. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. “అంతర్జాతీయ చట్టాలను ఉత్తరకొరియా ఉల్లంఘిస్తోంది. ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లేలా చేస్తోంది. చెత్త బెలూన్లను ప్రయోగించింది. విమాన సర్వీసులకు, ఓడల సర్వీసులకు అంతరాయం కలిగిస్తోంది. ఇవి మొత్తం చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేర్చడమే ఉత్తరకొరియా ఉద్దేశం లాగా కనిపిస్తోందని” దక్షిణ కొరియా అధికారులు అంటున్నారు. ఉత్తరకొరియా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఐక్యరాజ్యసమితి ఒత్తిడి తీసుకురావాలని దక్షిణ కొరియా అధికారులు సూచిస్తున్నారు. ప్రపంచానికి ఉత్తరకొరియా అధినేత కిమ్.. ఒక పెను విపత్తు లాగా మారాడని వారు చెబుతున్నారు.