Cancer: వైద్యరంగం ఎంత పురోగమించినా నేటికీ క్యాన్సర్ నిర్ధారణకు పాత పద్ధతులే శరణ్యం. అప్పటికే క్యాన్సర్ వ్యాధి ముదిరి పోతుండడంతో రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఎంతటి అత్యాధునిక వైద్య చికిత్సలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి క్రమంలో క్యాన్సర్ నిర్ధారణ అనేది ముందుగానే చేస్తే రోగి ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. క్యాన్సర్ ను గుర్తించాలంటే ప్రస్తుతం సిటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్, పెట్ స్కాన్.. వంటి పరీక్షలు చేయాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. పైగా ప్రస్తుతం మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోనూ రకరకాల క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కానీ క్యాన్సర్ ను ముందస్తుగా నిర్ధారించే పరీక్షలు రాలేదు.

శాస్త్రవేత్తల కృషితో
క్యాన్సర్ లక్షణాలు బయటపడక ముందే ముందే గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరీక్షతో శరీరంలోని ఏ ఏ ప్రాంతంలో క్యాన్సర్ ఉన్నదో కూడా తెలుసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. 50 సంవత్సరాలకు పైబడి వయసు ఉన్న 6,529 మందిని పరీక్షించగా 92 మందిలో క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. అందులో 36 మందికి రక్త క్యాన్సర్, ఒక మహిళకు రెండు రకాల క్యాన్సర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ రక్త పరీక్షకు గ్యాలరీ టెస్ట్ అని నామకరణ చేశారు. దీంతో రొమ్ము, కాలేయ, ఊపిరి తిత్తులు, పేగు, అండాశయ క్యాన్సర్లను గుర్తించవచ్చు.

ప్రాథమిక దశలో చికిత్స
చాలా సందర్భాల్లో క్యాన్సర్ శరీరం మొత్తం వ్యాప్తి చెందాక గాని బయటపడదు. కానీ ఈ రక్త పరీక్షతో ప్రాథమిక దశలోనే, అది కూడా లక్షణాలు బయటపడక ముందే క్యాన్సర్లను గుర్తించవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్యాబ్రిక్ అండ్రీ అంటున్నారు. వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.