Russia Ukraine War: బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కితే ఎలా ఉంటుంది? దెబ్బకు చస్తుంది. గరకపోచలు ఒక్కొక్కటి గొలుసులాగా మారితే ఏమవుతుంది? మదపుటేనుగు బంధీ అవుతుంది. రెండో అతిపెద్ద సైనిక శక్తి, సహజవాయువులు, ఖనిజనిక్షేపాలు, వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ.. ఇలా ఏ రంగంలో చూసినా అత్యంత సంపన్న దేశం. కానీ ఏం జరిగింది ఉక్రెయిన్ దెబ్బకు రష్యాకు పీచేముడ్ అయింది. రష్యా సేనలు ఒక్కొక్కటిగా ప్రాంతాలను వీడుతూ వెను తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ” కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు” గా తయారైంది రష్యా పరిస్థితి. డాన్ బాస్కో ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించి వేరే దేశాలుగా మార్చాలని ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టి, 2014 నుంచి రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడ్డ రష్యా.. మొదట్లో అన్ని ప్రాంతాలపై దాడులు జరిపింది. ఆ తర్వాత తనకు అత్యంత ఉపయుక్తమైన అర్థ చంద్రకారంపై దృష్టి సారించింది. క్రిమియా ద్వీపకల్పం రష్యా ఆధీనంలోనే ఉన్నా.. నల్ల సముద్రం, అజోవ్ సముద్రాలపై ఆధిపత్యం లేకపోవడంతో క్రిమియా నుంచి తన భూభాగంలోని బెల్గోర్డ్ కు రోడ్డు మార్గానికి ప్రయత్నాలు చేసింది. ఉక్రెయిన్ కు పోర్టులు, సముద్రమార్గం లేకుండా చేయాలనేది రష్యా ప్రధాన లక్ష్యం. ఉక్రెయిన్ పై దురాక్రమణకు రెండు రోజుల ముందే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ డోనెట్స్క్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ లుహాన్క్స్ ను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్ కరెన్సీ స్థానంలో రూబుల్స్ చలామణికి చర్యలు తీసుకుంది. మైకోలేవ్, ఖెర్సో న్, ఒడెసా, మరియా పోల్ ను వేరువేరు దేశాలుగా ప్రకటించే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడే రష్యా పప్పులో కాలేసింది. ఉక్రెయిన్ ఏమి చేయలేదన్న ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరించింది.

ఊహించని రీతిలో పుంజుకుంది
వారం రోజుల్లో ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవచ్చని ధీమాతో రష్యా యుద్ధంలోకి దిగింది. కానీ నెలలు గడిచిన పై చేయి సాధించలేకపోయింది. ఒక దశలో రష్యా విక్టరీ డే అయిన మే తొమ్మిదో తారీఖున పుతిన్ కీలక ప్రకటన చేస్తారని వార్తలు విలువడ్డాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. రోజులకొద్దీ యుద్ధం చేస్తుండటంతో రష్యా సేనలు అలసిపోయాయి. దీంతో గత్యంతరం లేక కీవ్ శివార్లలో 65 కిలోమీటర్ల భారీ కాన్వాయ్ ని వెనక్కి రప్పించింది. చివరకు ఆయుధ సామాగ్రి నిండుకోవడంతో ఆయుధాలు కావాలంటూ చైనా, ఉత్తర కొరియాలను అడగాల్సిన దుస్థితికి చేరుకుంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ముందు నుంచి తన సైనికుల్లో మనో ధైర్యం పెంచేలా మాటలు చెబుతూ వస్తున్నారు. రష్యా తమ దేశంపై సాగిస్తున్న దమనకాండను ప్రపంచ దేశాలకు వివరిస్తూ.. ఆయుధాల సరఫరాను నిలుపుదల చేయాలని కోరారు. దీంతోపాటే ఈ నెల ఆరంభం నుంచి అనితర సాధ్యమైన ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ రష్యాపై ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. దీంతో రష్యా సేనలు వెను తిరగడం ప్రారంభించాయి. ఇంతకాలం రష్యా ఆధీనంలో ఉన్న ఆరు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో రష్యా ఊహించిన అర్థ చంద్రాకార ఆక్రమణకు చెక్ పడింది.
అమెరికా ఇచ్చిన రాకెట్లతో..
ఇన్నాళ్లు రష్యా దాడులతో భీతిల్లిన ఉక్రెయిన్ ఒక్కసారిగా ప్రతిఘటించడం వెనుక అమెరికా ఉన్నది. ఆ దేశం ఉక్రెయిన్ కు స్వల్ప శ్రేణి, దీర్ఘ శ్రేణి రాకెట్లను ఇచ్చింది. ఈ ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాను ముప్పు తిప్పలు పెడుతుంది. డో నెట్స్క్ లో అమ్మకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సేనలపై స్వల్ప శ్రేణి రాకెట్లతో ఉక్రెయిన్ వరుస దాడులు చేసింది. ఈ దాడి ఫలితంగా రష్యా సేనలు 60 కిలోమీటర్ల దూరం కి వెళ్ళాయి. అయితే యుద్ధానికి ముందు పుతిన్ సలహాదారులు, మిలట్రీ జనరళ్ళు ఆయనను వారించారు. ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని సరైన సమయంలో యుద్ధం చేయడం మంచిదని సలహా ఇచ్చారు.

కానీ ఆ సలహాలను పట్టించుకోకుండా యుద్ధంలోకి దిగారు. ఈ యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలన్నీ రష్యాపై దుమ్మెత్తి పోశాయి. యుద్ధం వల్ల రష్యాకు అపారమైన నష్టం జరిగింది. ఇప్పటికే 53, 300 సైనికులను రక్షా కోల్పోయింది. 2,175 యుద్ద ట్యాంకులను, 4,662 ఆర్మ్డ్ ఫైటర్ వెహికల్స్, 1,279 ఆర్టీలరీ వ్యవస్థలు, 311 మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలు, 165 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ వ్యవస్థలు, 244 యుద్ధ విమానాలు, 904 డ్రోన్లు, 213 హెలికాప్టర్లు, 3,469 మిలిటరీ వాహనాలు, 15 యుద్ధ నౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. మంచి యుద్ధం చెడ్డ శాంతి ఉండవనే బెంజిమన్ ఫ్రాంక్లిన్ మాటలు ఇప్పుడిప్పుడే పుతిన్ కు అనుభవంలోకి వస్తున్నాయి.