Indian Murder in America : డాలర్ డ్రీమ్‌తో అగ్రరాజ్యం అమెరికా వెళ్లున్న భారతీయులు అక్కడ వివిధ కారణాలతో మరణిస్తున్నారు. కొందరు ప్రమాదవ శాత్తు మరణిస్తుంటే.. కొందరు అక్కడి వారి దాడుల్లో చనిపోతున్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్నో ఆశలతో వెళ్లినవారు విగత జీవులుగా శవపేటికల్లో స్వదేశానికి వస్తున్నారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోఖం మిగులుస్తున్నారు. తాజాగా అమెరికాలో తుపాకీ విష సంస్కృతికి భారత సంతతికి చెందిన మరో వ్యక్తి మరణించాడు. నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల్లో భారతీయుడు మృతిచెందాడు. మైనాంక్ పటేల్ అనే 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని నార్త్ కరోలినాలోని ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని తన కన్వీనియన్స్ స్టోర్ టొబాకో హౌస్‌లో మంగళవారం దోపిడీకి వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మైనాంక్ పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మరణించాడు. నిఘా ఫుటేజీలో ఒక యువ అనుమానితుడు, నల్లటి షార్ట్స్, హూడీ మరియు స్కీ మాస్క్ ధరించి, సంఘటనా స్థలం నుండి పారిపోతున్నట్లు రికార్డయింది. నిందితుడు మైనర్‌గా గుర్తించారు పోలీసులు.
నిధుల సేకరణ..
మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, ఐదేళ్ల కూతురు ఉన్నారు. అమీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఈ సమయంలో భర్త మరణంతో కన్నీరుమున్నీరవుతోంది అమీ. అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి నిధుల సేకరణ ప్రచారం ప్రారంభించారు. అంత్యక్రియల ఖర్చులు, వైద్య ఖర్చులను కవర్ చేయడానికి మరియు పటేల్ కుటుంబానికి కొనసాగుతున్న సహాయాన్ని అందించడానికి 500,000 డాలర్లు సేకరించాలని ప్రచారం కోరుతోంది. నిధుల సమీకరణ నిర్వాహకుడు పటేల్‌ను ఆప్యాయత, దయగల వ్యక్తిగా అభివర్ణించాడు, అతనికి తెలిసిన వారందరూ ఆదరించారు. ప్రచారం పటేల్ కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు ఈ క్లిష్ట సమయంలో నావిగేట్ చేయడంలో వారికి సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది.
మరో ఘటనలో తెలంగాణ విద్యార్థి..
ఇదిలా ఉంటే., అమెరికాలో జరిగిన మరో ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి రాజేశ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాజేశ్ మృతికి కారణమేంటో తెలియలేదు. మృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. మరణానికి కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన ఆరుకొండ రాజేశ్.. 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడినే చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల మృతిచెందాడు. మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కుమారుడి ఎలా చనిపోయాడో తెలియక తల్లడిల్లుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాజేష్ తండ్రి కూడా ఇటీవల చనిపోయారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు సహకరించాలని రాజేశ్ తల్లి, సోదరి కోరుతున్నారు.