CM Chandhrababu : గత ఐదేళ్ల వైసిపి హయాంలో చాలామంది అధికారుల తీరు వివాదాస్పదమైంది. జగన్ ఇచ్చిన స్వేచ్ఛను హరించిన వారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని అప్పటి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకుని వచ్చిన వారు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు కీలక అధికారుల తీరును ఆక్షేపించారు. సీఎంఓలో ధనుంజయ రెడ్డి వైఖరితోనే తాము నష్టపోయామని చాలామంది నేతలు బాహటంగానే చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో కేంద్ర సర్వీసులపై ఉన్న అధికారులను తెచ్చి జగన్ కీలక పోస్టులు కట్టబెట్టారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న సొంత సామాజిక వర్గం అధికారులను సైతం రప్పించి బాధ్యతలు అప్పగించారు. వారు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో జగన్ బుక్కయ్యారు. వైసిపి దారుణంగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అస్మదీయ అధికారుల అంటూ కొంతమంది పై ముద్ర వేసి పక్కకు తప్పించింది. మరికొందరిని రిజర్వులో పెట్టింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. దీంతో వైసిపి హయాంలో యాక్టివ్ గా పని చేసిన చాలామంది సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పక్కకు వెళ్లిపోయారు. కేవలం వైసీపీ ప్రభుత్వ చర్యలతోనే తాము అలా వ్యవహరించామని అధికార గణం చెబుతుండగా.. ఆ అధికారుల తీరుతోనే ఓడిపోయామని వైసిపి నేతలు చెబుతున్నారు.అయితే ప్రస్తుతానికి అధికారులే మూల్యం చెల్లించుకున్నారు. కొందరు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయగా.. మరికొందరు అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. ఇంకొందరు అయితే వీఆర్ఎస్ తీసుకున్నారు.
* అతను ఓ సూపర్ సిఎస్
జగన్ హయాంలో సూపర్ సీఎస్ లా పని చేశారు ప్రవీణ్ ప్రకాష్. సీఎంఓలో అందరిపైనా తానే బాస్ అన్నట్లు వ్యవహరించారు. విశాఖ రాజధానిగా ఎంపిక చేశాక అక్కడకు వెళ్లి.. ప్రభుత్వ పెద్దల కోసం ఏకంగా భవనాలను సైతం ఖరారు చేశారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. ఆ శాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులను ముప్పు తిప్పలు పెట్టారు. విద్యా శాఖలో పూటకో జీవో, వివాదాస్పద సంస్కరణలకూ ఆయనే ఆద్యుడు. వైయస్ జగన్ ఇచ్చిన స్వేచ్ఛతో రెచ్చిపోయారు.
* తోక జాడించారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రవీణ్ ప్రకాష్ తోక జాడించారు. ఏకంగా ఉపాధ్యాయులను క్షమించాలని కోరారు. గతంలో తప్పు చేసి ఉంటే క్షమించాలని వేడుకొన్నారు. కూటమి ప్రభుత్వం తనని పై చర్యలు తీసుకుంటుందని తెలుసుకున్నారు. అందుకే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికి ప్రభుత్వం ఆమోదించడంతో ఇక ప్రవీణ్ ప్రకాష్.. శకం ముగిసినట్టేనని అంతా భావించారు. ఆయన గురించి దాదాపు మరిచిపోయారు కూడా.
* మళ్లీ వస్తానంటున్న ప్రవీణ్ ప్రకాష్
అయితే మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చారు ప్రవీణ్ ప్రకాష్. అప్పట్లో మానసిక ఒత్తిడిలో ఉండి వీఆర్ఎస్ తీసుకున్నారని.. అవకాశమిస్తే వెనక్కి తీసుకుని తిరిగి విధుల్లో చేరతానని ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తే.. ఆయనను కలిసి అన్ని విషయాలు వివరించేందుకు సిద్ధమని చెబుతున్నట్లు సమాచారం. విఆర్ఎస్ తీసుకున్న మూడు నెలల వరకు దాని వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.