PM Modi US Visit : అమెరికా నడిబొడ్డున ‘ఏఐ’కి కొత్త అర్థం చెప్పిన నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు అమెరికా ఎందుకు అత్యంత కీలక భాగస్వామో సోదాహరణంగా వివరించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరూ కృత్రిమ మేధ అనుకుంటున్నారు. కానీ దానికి మరొక పదం ఉంది. ఏ అంటే అమెరికా, ఐ అంటే ఇండియా.. ఇవి రెండు కలిసి ప్రపంచానికి సరికొత్త మార్గదర్శనం చేస్తాయి

Written By: Bhaskar, Updated On : June 23, 2023 9:34 pm
Follow us on

PM Modi US Visit : అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు ద్వైపాక్షిక ఒప్పందల మీద సంతకాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో చైనా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికాతో స్నేహబంధాలను మరింత దృఢం చేసుకుంటున్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. రక్షణ రంగంలో కీలకమైన ఫైటర్
జెట్ల ఇంజన్ల తయారీలో జనరల్ ఎలక్ట్రిక్ సాంకేతిక బదిలీ మొదలు, భారీ పే లోడ్లు మోసుకుపోగల మానవ రహిత డ్రోన్ల సరఫరా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) తో పాటు, ఇస్రో, నాసా ల మధ్య సంయుక్త ప్రాజెక్టుల పై ఒప్పందాలు చేసుకున్నారు. డిఫెన్స్ స్టార్ట ప్ ల కోసం సంయుక్త సంస్థ ఇండస్_ ఎక్స్ లాంఛనంగా ప్రారంభమైంది. అమెరికా నావికా దళ నౌకల మరమ్మతులకు భారత్ సహకరించడం, భారత్ లో యూనిట్ల స్థాపనకు ఏర్పాటుకు దిగ్గజ సెమి కండక్టర్ సంస్థ మైక్రాన్ ముందుకు రావడం హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ ప్రక్రియ సులభతరం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కొత్త అర్థం చెప్పారు

అమెరికా అధ్యక్ష భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు అమెరికా ఎందుకు అత్యంత కీలక భాగస్వామో సోదాహరణంగా వివరించారు. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరూ కృత్రిమ మేధ అనుకుంటున్నారు. కానీ దానికి మరొక పదం ఉంది. ఏ అంటే అమెరికా, ఐ అంటే ఇండియా.. ఇవి రెండు కలిసి ప్రపంచానికి సరికొత్త మార్గదర్శనం చేస్తాయి. అమెరికాతో మాకు హద్దులు లేని స్నేహం ఉంది. భారత దేశంలో మహాత్మా గాంధీ ఎంత గొప్పవారో, అమెరికాలోనూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంతే గొప్పవారు” అని ప్రధాని కీర్తించారు. అమెరికాలోని చట్టసభల ప్రతినిధులు మోదీ మాట్లాడుతుండగా.. కరతాళ ధ్వనులు చేస్తూ ఉత్సాహపరిచారు.

ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మోడీ మాట్లాడారు. భారత్ _ అమెరికా స్నేహ బంధానికి ఆకాశం కూడా హద్దు కాదని తేల్చి చెప్పేశారు. ” ఇరుదేశాల్లోని రాజ్యాంగంలోని తొలి మూడు పదాలు ( వీ ద పీపుల్) ఒకటే. రెండు దేశాల మధ్య సారూప్య విలువలు ఉన్నాయి. అందుకే భారత్_ అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది. రెండు గొప్ప దేశాలు. రెండు గొప్ప శక్తులు. ఇద్దరు గొప్ప స్నేహితులు. 21 శతాబ్ద గమనాన్ని ప్రభావితం చేయగలరు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారత్ అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరం. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను అరికట్టడంలో చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని” మోడీ వివరించారు. సుదీర్ఘంగా సాగిన మోడీ ప్రసంగం పట్ల భారతీయ అమెరికన్లు, అమెరికన్లలో సానుకూలత వ్యక్తం అవుతున్నది. భారత ప్రధాని మాట్లాడుతున్నంత సేపు అమెరికన్ చట్టసభలు ప్రతినిధులు లేచి నిల్చుని చప్పట్లు కొట్టడం విశేషం. ప్రస్తుతం మోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సరికొత్త నిర్వచనం ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.