Covi Shield : “కోవిడ్ నివారణ కోసం వేసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కడుతోంది. అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అనారోగ్యం బారిన పడుతున్నాం. రక్తనాళాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని” ఇటీవల కొంతమంది ఇంగ్లాండ్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోవి షీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసిన ఆస్ట్రా జనేకా అనే కంపెనీని కోర్టుకు ఈడ్చారు. అయితే అప్పటిదాకా తాము తయారు చేసిన వ్యాక్సిన్ లో ఎటువంటి లోపాలు లేవని, సైడ్ ఎఫెక్ట్స్ అసలే తలెత్తవని అస్ట్రా జనేకా స్పష్టం చేసింది. కానీ, ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాసులు కోర్టుకు ఎక్కారో.. అప్పుడు మాట మార్చింది. “సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడో ఓ చోట ఉంటాయని” సన్నాయి నొక్కులు నొక్కింది. దీంతో ఆస్ట్రా జనేకా కంపెనీ తీరు పట్ల నిన్నటి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ పట్ల వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.. కోవిడ్ సమయంలో భారత్ చీఫ్ ఎపిడిమియాలజిస్ట్, ICMR సీనియర్ శాస్త్రవేత్త సమీరన్ పాండా కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆయన కోవి షీల్డ్ వ్యాక్సిన్ పట్ల ఏమంటున్నారంటే..
భయపడాల్సిన అవసరం లేదు
“వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డలు కట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. ఏ వ్యాక్సిన్ అయినా ఎంతో కొంత దుష్పరిణామాలు కలిగిస్తుంది. కోవి షీల్డ్ కూడా అంతే. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మనదేశంలో కోవిడ్ సమయంలో చాలామంది కోవి షీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అప్పట్లో ఆస్ట్రాజనేకా.. ప్రజలు భయాందోళనకు గురవుతారని దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చెప్పలేదు. కానీ, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆ కంపెనీ బాధ్యులు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంగ్లాండ్ లో కోర్టు ఎదుట చెప్పారు. డ్రగ్ డెవలప్మెంట్ లేదా వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో శాస్త్రీయ ఆధారాలు చూపించిన తర్వాతే ఏ కంపెనీ అయినా వాటిని బయటకు విడుదల చేస్తుంది. అలా చేయకుండా వ్యాక్సిన్ నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కోవిడ్ సమయంలో నేను చీఫ్ ఎపిడిమియాలజిస్ట్ గా ఉన్నాను. సాధారణంగా ఒక అంటువ్యాధి ఎక్కువకాలం మనగడలో ఉండదు. కోవిడ్ కూడా అంటువ్యాధి కాబట్టి.. దానిని నిరోధానికి ఒక శాస్త్రీయ విధానం అంటూ లేదు కాబట్టి.. అప్పట్లో ప్రపంచం చాలా సవాళ్లు ఎదుర్కొంది. అప్పట్లో ఒక వ్యాక్సిన్ అభివృద్ధి అయిందంటే మామూలు విషయం కాదు. పైగా క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి. కాబట్టి ఆ వ్యాక్సిన్ పై ఎవరికీ, ఎటువంటి సందేహం కలగలేదు.
గుండెపోటు మరణాల గురించి..
“ఆస్ట్రా జనేకా తయారుచేసిన వ్యాక్సిన్ కు, ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాక్సిన్ పై మన దేశ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరిపారు. వారు తమ నివేదికలు కూడా వెలువరించారు. ఇందులో టీకాకు, ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఎటువంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా రక్తం గడ్డకట్టే అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి దీనిపై తదుపరి పరిశోధన జరుగుతుంది. కోవిడ్ సమయంలో ఆ వైరస్ ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగించారు.. ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతుందని చెబుతున్నారు. అయితే ఎంత మేర రక్తం గడ్డ కడుతోంది, గడ్డకట్టే శాతం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా ఇక్కడ ముఖ్యమే. అది సాధారణంగా ఉందా? లేక అంతకంటే ఎక్కువ ఉందా అనేది తేడాల్సి ఉంది. ముందుగానే చెప్పినట్టు రక్తం గడ్డకట్టే తీరు పట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మరణాలకు ఇంతవరకు స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు అనవసరమైన ప్రచారాన్ని సాధ్యమైనంత వరకు మానుకోవాలని” సమీరన్ పాండా పేర్కొన్నారు.
దేశ ప్రజల తరఫున ఆస్ట్రా జనేకా కు వ్యతిరేకంగా ఇంగ్లాండ్ కోర్టులో మాట్లాడతారా? అనే ప్రశ్నకు.. సమీరన్ పాండా స్పష్టత ఇచ్చారు. ” ప్రతి డ్రగ్ డెవలప్మెంట్ సమయంలో శాస్త్రీయ సాక్ష్యం నిరూపించాల్సి ఉంటుంది. అందువల్ల ఒక్క వ్యాక్సిన్ వల్లే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయని చెప్పడం కష్టమవుతుంది. పైగా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి కోర్టు ఎదుట స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఏ కంపెనీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వ్యాక్సిన్ ను మార్కెట్లో రిలీజ్ చేయదని” సమీరన్ పాండా పేర్కొన్నారు.