Telugu News » World » Many beggars in america us government did not recognize them
Beggars in America : డాలర్లు పండే అమెరికాలో.. బిచ్చగాళ్ళకేం కొదవలేదు
సాధారణంగా ఇలాంటి విషయాలను అమెరికా బయటికి తెలియనియదు. అక్కడ మీడియా సంస్థలు కూడా రాసేందుకు ఆసక్తి చూపవు. అమెరికా అంటే వారి దృష్టిలో సంపన్న దేశం, అదే భావనను ప్రపంచం మొత్తం అనుకునే విధంగా చేస్తుంటాయి.
Beggars in America : “అమెరికాలో డాలర్లు పండును.. ఇండియాలో సంతానం పండును”.. అప్పట్లో జనాభాకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు పై వాక్యాన్ని కచ్చితంగా ఉటంకించేవారు. తర్వాతి రోజుల్లో అమెరికా డాలర్లు పండిస్తూ ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా ఎదిగింది. గిట్టని దేశాలపై యుద్ధాలు చేసింది. ఇండియా జనాభాను పెంచుకుంటూ చైనాలో దాటేసింది. స్వీయ సమృద్ధి సాధిస్తూ కరోనా వంటి పీడ దినాల్లోనూ ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేసింది. సరే ఈ ప్రస్తావన వదిలేస్తే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా నిజంగా సంపన్న దేశమేనా? డాలర్లు పండే శ్వేత దేశంలో బిచ్చగాళ్లు ఎందుకు ఉన్నారు? చదువుతుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా! ఇంతకీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరూ చదివేయండి.
బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు
అమెరికా అంటే చాలామంది మదిలో అభివృద్ధి చెందిన దేశం అనే భావన ఉంటుంది. డాలర్లు పండిస్తున్న దేశమని, సంపన్నులున్న ప్రాంతమని అందరూ అనుకుంటారు. దేశంలోనూ పేదలు, ఇళ్ళు లేని నిరాశ్రయులు, బిచ్చగాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. అక్కడి పాలకులకు కనిపించని యాచకులు పెద్దపెద్ద నగరాల్లో అందమైన భవనాల నీడన రోడ్ల మీద అడుగడుగునా కనిపిస్తుంటారు. చికాగో, డెట్రాయిట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో యాచకులు ఎక్కువగా ఉంటారు. వీరంతా కూడా రోడ్లపై అక్కడక్కడ మౌనంగా, దిగాలుగా కనిపిస్తుంటారు. వీళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా జనం నుంచి డబ్బు సహాయం పొందుతారు. కొందరు ఆట, పాటలతో, వివిధ కళా ప్రదర్శనలతో యాచిస్తూ బతుకుతారు. “నాకు ఇల్లు లేదు. సహాయం చేయండి” అనే ఫ్ల కార్డు ప్రదర్శిస్తూ డబ్బులు అడుక్కుంటారు.
ప్రభుత్వం గుర్తించడం లేదు
అయితే అమెరికాలోని ఫెడరల్ ప్రభుత్వం వీరిని బెగ్గర్స్ అని గుర్తించడం లేదు.. వీరిని బెగ్గర్లు అనకుండా నిరాశ్రయులైన “పాన్ హ్యాండ్లర్స్” అనే పేరు పెట్టింది. పాదచారులు ఎక్కువగా తిరిగే నగరాల్లో రోడ్లపై కనిపించే బిచ్చగాళ్లలో.. ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళు ఉంటే.. మరి కొందరు అత్యవసరంగా డబ్బులు అవసరం ఏర్పడి అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనే విషయంలో ప్రభుత్వం లెక్కలు తీయదు. ఒకవేళ తీసినప్పటికీ ప్రభుత్వ పతిష్ట దిగజారుతుందనే భయంతో బయటికి ప్రకటించదు. అమెరికా దేశవ్యాప్తంగా 48 నగరాలలో నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, పాన్ హ్యాండ్లర్స్ అధికంగా ఉన్నారు. ముందుగానే చెప్పినట్టు న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా వంటి నగరాల్లో పాన్ హ్యాండ్లర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరాశ్రయులైన బిచ్చగాళ్లు చాలామంది ఉన్నారు. లాస్ ఏంజెల్స్ నగరంలో రోడ్ల పక్కన టెంట్లు వేసుకుని జీవించే యాచకులు చాలామంది ఉన్నారు. చాలా నగరాల్లో ఈ బిచ్చగాళ్ళు క్యాంపింగ్ రెండ్లతో రాత్రిపూట ఎక్కడపడితే అక్కడ తలదాచుకుంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మంది నిరాశ్రయులు ఉన్నారు. అయితే రాబోయే రెండు సంవత్సరాలలో కనీసం 25% బిచ్చగాళ్లను తగ్గించేందుకు అమెరికా వైట్ హౌస్ ప్రణాళిక రూపొందించింది.
వాస్తవం వేరు
నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, డ్రగ్స్ వ్యసనం వంటి కారణాలతో చాలామంది బిచ్చగాళ్ళుగా మారుతున్నారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. ఇలా యాచించి బతికే వారిలో దాదాపు 70 శాతం మంది మాదక ద్రవ్యాలకు, దానికి బానిసలుగా మారిన వారే అని తెలుస్తోంది. ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించినప్పటికీ మారడం లేదని అక్కడి సామాజికవేత్తలు చెబుతున్నారు. మళ్లీ భిక్షాటన చేయడం, మద్యం లేదా డ్రగ్స్ తీసుకోవడం, రోడ్లు లేదా పార్కుల్లో నిద్రపోవడం వంటివి చేస్తారు. ఇక కొంతమంది అయితే కుటుంబ కలహాల వల్ల తల్లిదండ్రులు విడిపోవడం, యుక్త వయసులో ఉన్న వాళ్ల పిల్లలు నిరాశ్రయులు కావడం వంటి కారణాలతో భిక్షాటన వైపు వెళ్తుంటారు. అమెరికన్ లలో దయాగుణం, మానవత్వం అనేది ఎక్కువ ఉండటం వల్ల ప్రతి బిచ్చగాడు రోజుకు 20 నుంచి 60 డాలర్ల వరకు సంపాదిస్తాడు. నెల వరకు 1800 డాలర్ల వరకు వెనకేస్తాడు. కొంతమంది ఆ డబ్బును అప్పటికప్పుడు ఖర్చు చేస్తారు. కొంతమంది ప్రొఫెషనల్స్ అయితే ఆ డబ్బును వెనకేసుకుంటారు. సాధారణంగా ఇలాంటి విషయాలను అమెరికా బయటికి తెలియనియదు. అక్కడ మీడియా సంస్థలు కూడా రాసేందుకు ఆసక్తి చూపవు. అమెరికా అంటే వారి దృష్టిలో సంపన్న దేశం, అదే భావనను ప్రపంచం మొత్తం అనుకునే విధంగా చేస్తుంటాయి.