Tunisia: నేటి కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్ ఉంటోంది. ఇందులో రకరకాల సోషల్ మీడియా యాప్స్ ఉండడంతో వాడటం అనేది అనివార్యమవుతోంది. అందువల్లే చాలామంది సో”సెల్” బందీలవుతున్నారు. ఈ వ్యసనం ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. చాలామంది ఫోన్లను అతుక్కుని ఉంటున్నారు. కొందరైతే బాత్రూం వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లను వెంట తీసుకెళ్తున్నారు.
సోషల్ మీడియాలో మన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అభిప్రాయాలు చాలామందిని ప్రభావితం చేస్తాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పుట్టిన ఉద్యమాలు దేశాల అధినేతలను గద్దెలు దించాయి. అందువల్లే సోషల్ మీడియా వినియోగం పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇటీవల నేపాల్ దేశంలో పుట్టిన ఉద్యమం అక్కడ ప్రకంపనలకు కారణమైంది. ఫలితంగా అక్కడి దేశాధినేత పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లే సోషల్ మీడియాలో దేశ ప్రజలు పెడుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు నిఘా విభాగం ఓ కంట కనిపెడుతూనే ఉంది.
ఫేస్బుక్లో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది.. యూనిషియ అధ్యక్షుడు కయస్ సయ్యద్ కు వ్యతిరేకంగా ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అయితే అది దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉందని పేర్కొంటూ అక్కడి న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. ప్రభుత్వాన్ని కూల్చే విధంగా.. అధ్యక్షుడిని అగౌరవపరిచే విధంగా.. ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే విధంగా ఆ పోస్టు ఉండడంతో కోర్టు మరణశిక్ష విధించింది. గత ఏడాది జనవరి నుంచి ఆ వ్యక్తిని జైల్లో ఉంచారు. అయితే ఆ వ్యక్తి దినసరి కూలి.. పని ప్రదేశంలో గాయపడడంతో దివ్యాంగుడిగా మారిపోయాడు. అయితే తన బాధలు చెప్పుకోడానికి మాత్రమే అతడు సోషల్ మీడియా వ్యక్తిగా పోస్ట్ పెట్టాడు. దానిని కోర్టు మరో విధంగా అర్థం చేసుకుంది. ఆ పోస్టులో అశాంతి కలిగించే మాటలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు అతడి తరపు న్యాయవాది ఇంకో విధంగా చెబుతున్నాడు. “అతడు పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఆన్లైన్లో ప్రజలను ప్రభావితం చేసే స్థాయి కూడా అతనికి లేదు. ఆన్లైన్లో ఉన్న సమాచారం మాత్రమే అతడు షేర్ చేశాడు. పైగా సోషల్ మీడియాలో అతనికి అంతగా ఫాలోయింగ్ కూడా లేదు. కానీ కోర్టు దీనిని పట్టించుకోకుండా అతనికి మరణశిక్ష విధించింది” ఆ లాయర్ పేర్కొన్నారు. అయితే లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ప్రజలలో తిరుగుబాటుకు ఇటువంటి పోస్టులు కారణమవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. అన్నట్టు ఈ సంఘటన ట్యూనిసియా దేశంలో చోటుచేసుకుంది. ఈ దేశంలో మరణశిక్ష నిబంధన అనేది ఉన్నప్పటికీ.. అరుదుగా మాత్రమే దీనిని విధిస్తుంటారు. 1991 లో వరుస హత్యలకు పాల్పడిన ఓ వ్యక్తికి చివరిసారిగా మరణశిక్ష విధించారు. దాదాపు 34 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ దేశంలో మరణశిక్ష విధిస్తున్నారు.