Nawaz Sharif: మా పొరపాటుతోనే కార్గిల్‌ యుద్ధం.. తప్పు ఒప్పుకున్న నవాజ్‌ షరీఫ్‌!

లాహోర్‌ ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే దానిని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో చొరబాట్లను అప్పటి పాక్‌ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఫలితంగానే కార్గిల్‌ యుద్ధం జరిగింది.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 4:38 pm

Nawaz Sharif

Follow us on

Nawaz Sharif: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లాహోర్‌ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో భారత్‌తో చేసుకున్న ఈ ఒప్పందాన్ని తాము ఉల్లంఘించినట్లు వెల్లడించారు. కార్గిల్‌ యుద్ధానికి అప్పటి ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కారణమని ఆరోపించారు. పాకిస్తాన్‌ తొలి అణుప్రయోగం నిర్వహించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1999 నాటి లాహోర్‌ డిక్లరేషన్‌ గురించి ప్రస్తావించారు.

తప్పు ఒప్పుకున్న షరీఫ్‌..
1999లో అప్పటి భారత ప్రధాని పాకిస్తాన్‌కు వచ్చి ఒప్పందం(లాహోర్‌ డిక్లరేషన్‌) కుదుర్చుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది తమ తప్పే అని వ్యాఖ్యానించారు. లాహోర్‌ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

చొరబాట్లతో ఉల్లంఘన..
లాహోర్‌ ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే దానిని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో చొరబాట్లను అప్పటి పాక్‌ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఫలితంగానే కార్గిల్‌ యుద్ధం జరిగింది. ఇందులో పాకిస్తాన్‌ ఘోర పరాభవం చవిచూసింది. ఆ సమయంలో అణు పరీక్షలు నిర్వహించకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పాకిస్తాన్‌కు 5 బిలియన్ల ఆర్థికసాయం ఇస్తామని ఆశ చూపినట్లు నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. ఆ ఆఫర్‌ను నాటి ప్రధానిగా తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

ఇమ్రాన్‌ అంగీకరించేవాడు..
నాడు తన స్థానంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉండి ఉంటే.. బిల్‌ క్లింటన్‌ ప్రతిపాదనను అంగీకరించేవాడని నవాజ్‌ అభిప్రాయపడ్డాడు. నాడు తనను గద్దె దించేందుకు దేశంలోని నిఘా సంస్థ కుట్ర పన్నిందని ఆరోపించారు. తప్పుడు కేసు బనాయించిందని, తన ప్రయత్నంలో విజయం సాధించిందని వివరించాడు.