KA Paul America: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా.. ఒక మతానికి సంబంధించిన ప్రచారకుడిగా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన చాలా రోజుల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నారు. గతంలో ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఉండేది. చెబుతుంటే కాస్త అతిశయోక్తి లాగా ఉండవచ్చు గాని.. 2004 కు ముందు పాల్ కు తిరుగులేదు. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన ప్రచారకుడిగా ఆయన ప్రపంచ దేశాలు తిరిగారు.. ఆయన కోసం చాలా దేశాల ప్రతినిధులు ఎదురుచూసేవారు. ఆయన దర్శనమే మహాభాగ్యం అనుకునే రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేఏ పాల్ అప్పట్లాగా లేరు. ఆయనకు ఏమైందో.. ఎందుకిలా మారిపోయారో.. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పోనీ రాజకీయాలలో పూర్తిస్థాయిలో ఉంటున్నారంటే అది కూడా లేదు. ఎప్పుడో ఒకసారి మీడియాలోకి వస్తుంటారు. ఏదో చెబుతుంటారు. ఆ తర్వాత మాయమైపోతుంటారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలలో వివిధ కేసులు వేస్తుంటారు. వాటి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ తర్వాత జాడ పత్తా ఉండరు.
రాజకీయాలలో స్థిరంగా ఉంటేనే ప్రజల ఆమోదము లభిస్తుంది. అవసరమైతే అధికారం కూడా ప్రాప్తిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న నాయకులు గాని.. అంతకుముందు అధికారంలో ఉన్న నాయకులు గాని తీవ్రంగా కష్టపడిన వారే. ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. రాత్రికి రాత్రి వారు నాయకులు కాలేదు. రాత్రికి రాత్రి పదవులను అనుభవించలేదు. అయితే కేఏ పాల్ ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. ఓవర్ నైట్ లో ఆయన ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నారు. పరిపాలన పగ్గాలు తన చేతికి రావాలని భావిస్తున్నారు. కానీ అది అంత సులభం కాదు కదా.
ఇక ప్రస్తుతం పాల్ శ్వేత దేశం లో ఉన్నారు. అక్కడ ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక స్వీయ వీడియోలో ఆయన ఒకసారిగా ప్రత్యక్షమయ్యారు. తన వెనుక చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వారిని పక్కన పెట్టుకొని కేఏ పాల్ ఆంధ్ర రాజకీయాలను మాట్లాడారు. తన సొంత రాష్ట్రంలో ఖాకీలు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలతో సంబంధం లేకుండా సొంత న్యాయం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో అక్కడి ఖాకీలు కొంతమంది యువకులపై వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. అంతేకాదు కన్నడ రాష్ట్ర రాజధాని లో జరిగిన తొక్కిసలాట.. నిర్మల్ లో ఓ రైతుపై ఓ ఖాకీ వ్యవహరించిన తీరు.. ఇలా అన్నింటిని ఆయన ఏకరువు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇక్కడి సమస్యలను అమెరికా కేంద్రంగా ప్రస్తావించడం ఎందుకు? అదేదో బాధ్యతగల రాజకీయ పార్టీ నాయకుడిగా కేఏ పాల్ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయవచ్చు కదా.. ఏంటో కేఏపాల్ సార్ ఎవరికీ అర్థం కాడు. ఎవరినీ అర్థం చేసుకోలేడు.
ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల చట్ట విరుద్ధ కార్యక్రమాలు మీద అమెరికాలో కే. ఏ. పాల్ ఫైర్!#APPolice #KAPaul #Tenali #NDAGovt #UANow pic.twitter.com/AiW8ULJQQO
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 6, 2025