CM Revanth Reddy Slams KCR: ఎక్కడో మారుమూల పాలమూరు జిల్లాలో తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చారు. ఈ ప్రయాణంలో జైలుకు వెళ్లారు. విమర్శలు ఎదుర్కొన్నారు. తీవ్రస్థాయిలో ఆరోపణలను కూడా చవిచూశారు. అంతిమంగా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.. తెలంగాణ ఫస్ట్ సీఎం ను గద్దె దించుతానని శపథం చేశారు. అనుకున్నట్టుగానే ఆ మాటను నెరవేర్చి చూపించారు. అసలు సోయిలో లేని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో అయితే ఏకపక్ష ఫలితాలు సాధించే విధంగా తోడ్పాటు అందించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా మారిపోయారు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పగ చల్లారనట్టు కనిపిస్తోంది. ఏకంగా గులాబీ సుప్రీం ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఏమాత్రం వెనకడుగు వేయకుండా మండిపడుతున్నారు.
శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ” నేను అనుకున్న లక్ష్యం పూర్తయింది. ఆ పీఠం నుంచి ఆయనను తొలగించాలి అనుకున్న. అనుకున్నట్టుగానే పడగొట్టిన. ఇప్పుడు నాకే కోరికలు లేవు. ఉన్న కోరికలు మొత్తం నెరవేరినయి. ఇక ఎటువంటి ఇబంది లేదు. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.. జీవితంలో మీరు కూడా ఒక బలమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయండి. అంతిమంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని” మహిళలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందువల్లే అనేక పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉందని.. దీనికి మీ అందరి సహకారం కావాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. భారీగా ప్రజలు హాజరు కావడం.. సమీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులు విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారీగా వచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన ఆగ్రహంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు సభలో కాంగ్రెస్ నాయకులు ఈలలు వేస్తూ గోలలు చేశారు.. మహిళలు కూడా చప్పట్లు కొట్టడంతో రేవంత్ ఉత్సాహంతో మాట్లాడారు. మొదటి నుంచి ముగింపు దాకా గులాబీ సుప్రీమ్ పై రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక రకంగా తనలో ఉన్న కోపాన్ని ఈ విధంగా ప్రదర్శించారు.
నా లక్ష్యం కేసీఆర్ను గద్దె దించడమే.. అది పూర్తయ్యింది – రేవంత్ రెడ్డి pic.twitter.com/rJkvkdocW9
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2025