Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మిలియన్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. రేసులో ఎంతో మంది ఉన్నా.. చివరకు అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో మిగిలారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇద్దరు అభ్యర్థులు తుది విడత ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాదరణ ఉన్న నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. రిపబిలక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇప్పటికే తన మద్దతుదారు ఎలాన్ మస్క్, మెటా సీఈవో జూకర్ బర్గ్‌తో ప్రచారం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను రంగంలోకి దించారు.
బైడెన్ కీలక వ్యాఖ్యలు..
ఇక కమలా హారిస్ తరఫున బైడెన్ మాట్లాడారు. కమల గెలిస్తే బైడెన్‌లాగే పాలన ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కమలా హారిస్ గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారని తెలిపారు. తనకన్నా మెరుగైన పాలన అందిస్తారని పేర్కొన్నారు. తాను కూడా అదే చేశానని గుర్తు చేశారు. తాను మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విధేయుడిగా ఉన్నానని, ఉపాధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడిచానని పేర్కొన్నారు. అధ్యక్షుడిని అయ్యాక తన సొంత మార్గం ఎంచుకున్నానని వెల్లడించారు.
కమల కూడా సొంత మార్గంలోనే..
ఇక కమలా హారిస్ అధ్యక్షురాలు అయితే ఆమె కూడా తన సొంత మార్గంలో నడుస్తారని పేర్కొన్నారు. అమెరికా ప్రజల సమస్యలపై కమలా ఆలోచనా విధానం చాలా కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా విధానం పాతదని వెల్లడించారు. ట్రంప్ పాలనను ఇప్పటికే ప్రజలు చూశారని, ఆయన పాలన నచ్చకనే తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే కొత్తగా చేసేది ఏమీ ఉండదన్నారు. విఫలమైన పాలనా విధానాన్నే ట్రంప్ అవలంబిస్తారని పేర్కొన్నారు. నిజాయతీ లేని పాలనతో ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.