Japan Minister: రాజకీయాలలో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయి. రాజకీయ నాయకుల భవితవ్యాన్ని అవి క్షణాల్లోనే మార్చేస్తుంటాయి. అప్పటిదాకా కుర్చీ మీద కూర్చుని పెత్తనం చేసిన నాయకుడు ఒక్కసారిగా పదవిచ్యుతుడు అయిపోతాడు. అప్పటిదాకా జేజేలు పలికించుకున్న నాయకుడు విమర్శలు ఎదుర్కొంటాడు.. ఇలాంటి రాజకీయాలు మనదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అన్ని దేశాలలోనూ సాగుతున్నాయి. అంతటి నియంతృత్వ దేశాలలోనూ సారధులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. అందువల్లే నాయకులు అధికారంలో ఉన్నంత మాత్రాన గొప్పలు పోకూడదు. అక్రమాలకు ఆస్కారం ఇవ్వకూడదు. సాగినంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది.. తర్వాతే దెబ్బ పడుతుంది.
మన ఆసియా ఖండంలో జపాన్ అనే దేశం ఉంది. ఇక్కడ అవినీతికి పెద్దగా ఆస్కారం ఉండదు. కానీ అవినీతికి పాల్పడితే మాత్రం అక్కడి పరిపాలకులకు తలతీసినంతపని అవుతుంది. ఇలాంటి అనుభవమే అక్కడ ఓ మంత్రికి ఎదురైంది. దీంతో అతడు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..” నేను ఎప్పుడూ బియ్యం కొలను. నా అనుచరులే నాకు బియ్యం ఇస్తారు. అవే మా ఆహారంలో ఉపయోగిస్తారు. ఇంతవరకు నాకు బియ్యం ఎలా కొనుగోలు చేయాలో కూడా తెలియదు. అవి ఎక్కడ ఉత్పత్తి అవుతాయో తెలియదు. ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియదని” జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి టకు ఇటో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జపాన్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం జపాన్ దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణంగానే జపాన్ ప్రజలు తమ భోజనంలో బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రస్తుతం బియ్యం ధరలు తగ్గించాలని అక్కడ ప్రజలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. బియ్యం ధరలు భారీగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పారు. వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.
ఒకవేళ మన దేశంలో గనుక ఇలా జరిగి ఉంటే నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయరు. పశువుల దాణా ను బుక్కి.. మైన్స్ ను చెరబట్టి.. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా దోచుకుని.. వేల కోట్లు దాచుకొని.. న్యాయ విచారణలో అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు రాజీనామా చేసిన దాఖలాలు మన దేశ చరిత్రలో లేవు. అలాంటిది బియ్యం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకే మంత్రి రాజీనామా చేశారంటే.. జపాన్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు జపాన్ దేశం మన నుంచి చాలా నేర్చుకోవాలి.. అవినీతి రహిత పరిపాలన గురించి అయితే మాత్రం కాదు! అర్థం చేసుకున్న వాళ్లకు అర్ధమైనంత. అయితే ఆ రాజీనామా చేసిన మంత్రి ఇక జన్మలో ప్రత్యక్ష రాజకీయాలలో ఉండబోనని చెప్పినట్టు జపాన్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.