Burqa Ban : ఇటలీ.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియాగాంధీ పుట్టిన ఇల్లు.. ఈ దేశ అధ్యక్షురాలు జార్జియా మెలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన నేత. తాజాగా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్కా, నిఖాబ్, అభయా వంటి శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులను ధరించడాన్ని ప్రభుత్వం నిషేధించాలని పార్టీలో తీర్మానం చేశారు. పార్లమెంటులో త్వరలో బిల్లు ప్రవేశపెట్టి చట్టరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ చట్టం స్కూళ్లు, కాలేజీలు, సూపర్ మార్కెట్లు, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో బుర్కా ధరించడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. నిబంధనలను అతిక్రమించిన వారికి 300 నుంచి 3,500 యూరోల జరిమానా విధించనున్నారు.
‘సాంస్కృతిక ఏకత్వం కోసమే..
మెలోనీ అభిప్రాయమేమిటంటే ఇటలీ సంస్కృతిలో అందరు భాగస్వామ్యంగా ఉండాలని, ‘మేము వేరు‘ అనే భావనకు చోటు లేకూడదని. సాంస్కృతిక వేర్పాటు కాకుండా జాతీయ సమైక్యతే ఆవశ్యకం అనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ఈ తరహా ఆంక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఫ్రాన్స్ ఈ నిషేధానికి మొదట అడుగు వేసింది. తరువాత స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, టర్కీ, తజకిస్తాన్, శ్రీలంక, ట్యునీషియా వంటి దేశాలు కూడా తమ భద్రతా కారణాల వల్ల బుర్కా నిషేధాన్ని అమలు చేశాయి.
నిషేధానికి భద్రతా మూలాలు
ఇటలీ ప్రభుత్వం ముఖ్య కారణంగా భద్రత సమస్యను చూపిస్తోంది. ముఖం పూర్తిగా కప్పేసే దుస్తులు ధరించడం వలన వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుంది. కొంతమంది ఉగ్రవాదులు లేదా నేరస్థులు మారువేషంలో ఆయుధాలు లేదా నిషేధిత సామగ్రిని తరలించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి దుస్తులను అడ్డుకోవడం అవసరమని మెలోనీ ప్రభుత్వం పేర్కొంది.
కోర్టు కూడా సమర్థన..
ఇక బుర్కా నిషేధంపై చాలా మంది 2017 నుంచే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ కోర్టు కూడా బుర్కా నిషేధాన్ని సమర్థించింది. ప్రభుత్వాల భద్రత ప్రధాన హక్కుగా అంగీకరించింది.
మసీదుల నిధులపైనా నిఘా..
ఇటలీ ప్రతిపాదిత చట్టం కేవలం దుస్తులకే పరిమితం కాదు. దేశంలోని ఇస్లామిక్ సంస్థలకు వచ్చే విదేశీ నిధులపై కూడా పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక జరుగుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మార్గాల ద్వారానే మసీదులు లేదా మత సంస్థలు డొనేషన్స్ స్వీకరించగలవు. ఉగ్రవాదానికి వేదిక కావే అవకాశాలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం.
మారుతున్న ధోరణి..
ఆశ్చర్యకరంగా, కొన్ని ముస్లింలు అధిక జనాభా కలిగిన దేశాల్లో కూడా బుర్కా వ్యతిరేక ఉద్యమాలు కనిపిస్తున్నాయి. ఈజిప్ట్‌లోని అల్ అజర్ విశ్వవిద్యాలయం, అరబ్ ప్రపంచంలో ప్రధానమైన ఇస్లామిక్ అధ్యయన కేంద్రం, తన క్యాంపస్‌లో బుర్కా ధరించడం నిషేధించింది. ఇది మతపరమైన కాక భద్రతాపరమైన చర్యగా పేర్కొంది.
ఇటలీ చర్యతో యూరప్‌లో మతపరమైన గుర్తింపు కంటే జాతీయ సంస్కృతిని ప్రాధాన్యపెట్టే ధోరణి మరింత బలపడుతుంది. మరోవైపు, ఇది వ్యక్తిగత స్వేచ్ఛలపై మితిమీరిన నియంత్రణగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇటలీ చట్టం అమలులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా 21వ దేశంగా బుర్కా నిషేధ దేశాల జాబితాలో చేరనుంది.